డా బి ఆర్ అంబేద్కర్ కోనసంజిల్లా: బాల కార్మికులను గుర్తించేందుకు శుక్రవారం డా బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని అంగరల గ్రామంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీ బృందం పర్యటించింది. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శ్రీ కాశి శివ నాగ మల్లేశ్వర రావు పర్యవేక్షణలో ఈ తనిఖీలు జరిగాయి.
ఈ బృందంలో విద్యాశాఖ, పోలీస్ శాఖ (ASI), శ్రమ NGOకి చెందిన దుర్గారావు, ICDS నుంచి అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. గ్రామంలోని వివిధ దుకాణాలు, వ్యాపార సంస్థలు, వృత్తి నిర్వహణ కేంద్రాల్లో బాల కార్మికుల విషయమై జాగ్రత్తగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 18 సంవత్సరాలలోపు బాల కార్మికులు ఎవరూ కనిపించలేదు.
బృందం సభ్యులు యజమానులకు చట్ట నిబంధనలపై అవగాహన కల్పించారు. బాల కార్మిక చట్టాల ప్రకారం18 ఏళ్లు దాటకముందే పిల్లలను పనిలో పెట్టడం నేరం అని స్పష్టం చేశారు. అటువంటి పక్షంలో రూ. 50,000 జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశముందని, అలాగే బాల కార్మికుని పేరుతో రూ. 20,000 నష్ట పరిహారం డిపాజిట్ చేయాలని తెలిపారు.
వేతనాల విషయంలో విభేదాలు నెలకొన్న యజమానులు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అమలాపురం వద్ద విచారణకు హాజరై, తగిన వేతనాన్ని 10 రెట్లు పెనాల్టీతో చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బాల కార్మిక నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 3A ప్రకారం నేరాలు నమోదు చేసి కోర్టులో కేసులు దాఖలు చేయనున్నట్లు అధికారులూ తెలిపారు.
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మాట్లాడుతూ "బాల కార్మిక నిర్మూలన కోసం ప్రతి యజమాని చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలి. 'నేటి బాలలే రేపటి పౌరులు' అనే విషయాన్ని గుర్తుంచుకొని, వారిని చదువుకునేలా ప్రోత్సహించాలి. మండపేట, ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాలను బాల కార్మిక రహిత ప్రాంతాలుగా మార్చేందుకు అందరూ సహకరించాలి" అని పిలుపునిచ్చారు.