TELANGANA, జగిత్యాల జిల్లా: బ్రతికుండగానే ఓ వక్తిని స్మశానంలో పడుకోబెట్టిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. ‘కుక్క నక్కలా దైవ రూపాలుగా కొలిచి.. పంది నందిని జూస్తే పడి మొక్కుతుంటాడు.. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు’.. అని అందెశ్రీ ఏనాడో రాశారు. ప్రస్తుత సమాజంలో ఎటువైపు చూసినా ఈ వాక్యాలు నిజమని తెలుస్తున్నాయి. ఈ సమయంలో బ్రతికుండగానే ఓ వక్తిని స్మశానంలో పడుకోబెట్టిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది.
మనిషిలో రోజు రోజుకీ మానవత్వంపాళ్లు తగ్గిపోవడంతో పాటు మూడనమ్మకాలు, స్వార్థపూర్తిత ఆలోచనలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ఈ రోజుల్లో కూడా ఇంట్లో చనిపోతే మంచిది కాదని.. ఏదో అనర్ధం జరిగిపోతుందని చాలామంది భావిస్తున్నారు. దీంతో.. అద్దెకు ఉంటున్నవారు తీవ్ర అనారోగ్యంతో బాధపడితే వారిని ఇంట్లోకి రానివ్వడం లేదు యజమానులు.
ఇలాంటి సంఘటన తాజాగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణంలో చోటు చేసుకుంది. ఈ హృదయవిదారకమైన ఘటన ప్రతిఒక్కరినీ కదిలిస్తోంది.. ఆ ఇంటి యజమానిని తప్ప! ఈ క్రమంలో.. గత్యంతరంలేక అనారోగ్యానికి గురై, పరిస్థితి విషమించిన ఓ వ్యక్తిని బతికుండగానే స్మశానానికి తరలించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే... ధర్మపురి పట్టణానికి చెందిన రంగు గోపి అనే వక్తి స్థానికంగా హోటల్ నడుపుతూ, అద్దె ఇంట్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో... పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పడంతో.. తిరిగి ధర్మపురిలో అద్దెకు ఉంటున్న నివాసానికి తీసుకువచ్చారు.
దీంతో.. ఆ అద్దె ఇంటి యజమాని గోపి కుటుంబాన్ని లోపలికి అనుమతించలేదు. ఇక మరో గత్యంతరం లేక బతికుండగానే అతడిని స్మశానానికి తరలించిన కుటుంబసభ్యులు.. అక్కడే చాపపై పడుకోబెట్టి సపర్యలు చేస్తున్నారు. దీంతో.. వీరి పరిస్థితిని గమనించిన పట్టణంలోని మున్నూరు కాపు సంఘ సభ్యులు స్పందించి సంఘ భవనంలోకి వారిని తరలించారు.
విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. గోపి కుటుంబానికి పదివేలు స్థానిక నాయకుల ద్వారా అందజేశారు. ఈ సమయంలో... సొంత ఇల్లు లేక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తమ గోడు మంత్రికి విన్నవించుకున్నారు.