ఇక విశాఖ వేదికగా జరిగిన కార్యక్రమంలో తొలుత 2 లక్షల మంది వస్తారని ఆశిస్తే అనూహ్యంగా ఆ సంక్య మూడు లక్షలకు చేరింది.
ANDRAPRADESH:ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం సక్సెస్ అయింది. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా హాజరైన ఈ కార్యక్రమానికి విశాఖ ఆర్కే బీచ్ వేదికైంది. దాదాపు 3 లక్షల మంది ఒకే దగ్గర యోగాసనాలు వేయడం ద్వారా గిన్నీస్ రికార్డు నమోదైంది. ఇంతవరకు సామూహిక యోగసనాలలో 1.47 లక్షల మంది హాజరైనట్లు గిన్నీస్ రికార్డు ఉంది. ఈ రోజు విశాఖలో అందుకు రెట్టింపు సంఖ్యలో ప్రజలు హాజరై సరికొత్త రికార్డు సృష్టించారు.
గతంలో 1.47 లక్షల మందితో సూరత్ లో యోగాసనాలు వేశారు. ఇదే ఇప్పటివరకు గిన్నీస్ రికార్డుగా చెబుతున్నారు. అయితే 11వ అంతర్జాతీయ యోగా డేలో ఆ రికార్డును అధిగమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. మే 2న అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోడీని యోగా డేకు రావాల్సిందిగా అప్పుడే ఆహ్వానించారు. ప్రధాని కూడా చంద్రబాబు ఆహ్వానం మేరకు వెనువెంటనే విశాఖలో యోగా డే నిర్వహిస్తే తాను తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు
ప్రధాని మాట ఇచ్చినట్లే శనివారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి విచ్చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం దాదాపు నెల రోజులుగా శ్రమిస్తోంది. యోగాకు అంతర్జాతీయంగా ప్రచారం తీసుకువచ్చేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా యోగా డే నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వం పిలుపుతో దాదాపు 2.30 కోట్ల మంది యోగా చేసేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. ఇక విశాఖ వేదికగా జరిగిన కార్యక్రమంలో తొలుత 2 లక్షల మంది వస్తారని ఆశిస్తే అనూహ్యంగా ఆ సంక్య మూడు లక్షలకు చేరింది.
దీంతో విశాఖలో నిర్వహించిన యోగా డే సెలబ్రేషన్స్ గిన్నీస్ రికార్డును సృష్టించాయి. ఇప్పటివరకు గుజరాత్ లోని సూరత్ నగరం పేరిట ఉన్న రికార్డును విశాఖ వాసులు అధిగమించారు. ఈ కార్యక్రమాన్ని రికార్డు చేసిన గిన్సీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి గిన్సీస్ రికార్డు ధ్రువపత్రం అందజేశారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు దాదాపు 25 కిలో మీటర్ల మేర ప్రజలు ఆశీనులై యోగా చేయడం విశేషమని, ఇందుకు కృషి చేసిన అధికారులు, ప్రభుత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.