డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు: విధి నిర్వహణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆలమూరు ఎస్సై ముద్దాల అశోక్, కానిస్టేబుల్ ఎస్ బ్లెసన్ జీవన్ ఆత్మలకు శాంతి చేకూరాలని ఆలమూరు ప్రెస్ క్లబ్ సభ్యులు ఐదు నిమిషాల పాటు మౌనం పాటించారు. మండల కేంద్రమైన ఆలమూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎస్సై అశోక్, కానిస్టేబుల్ బ్లెసన్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏమిటో ప్రజలకు రుచి చూపించి, అసాంఘిక శక్తులకు సింహ స్వప్నమైన ఎస్సై ఇకలేరు అనే విషాదకరమైన వార్త దిర్భాంతికి గురిచేసిందన్నారు.
మండలంలో శాంతిభద్రతలను కాపాడటంలో తనదైన శైలితో తన కర్తవ్యాన్ని నిర్వర్తించే వారిని, అసాంఘిక శక్తుల నుండి బాలికలు మహిళలు తమకు తాము ఎలా రక్షించుకోవాలో గ్రామాల ముఖ్య కూడళ్ళలోను, పాఠశాలలోను ఎన్నో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారికి ధైర్యం చెప్పేవారిని, నేర సమాచారాన్ని విలేకరులకు తెలపడంలో ముందుండేవారిని ఇటువంటి మహనీయులను కోల్పోవడం ఇటు మీడియాకు అటు ప్రజలకు తీరనిలోటని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

Vijaya Babu. I
Staff Report | Konaseema