ఎన్నికలయిన ఏడాదికే ఏపీ రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి. అధికార పక్షం-ప్రతిపక్షం ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏకంగా కత్తులు దూసే వరకు వెళ్లింది. మాజీ సీఎం వైఎస్ జగన్ పై కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనపై ఇదే తొలి కేసు కావడం గమనార్హం. ఏపీలో 2019-24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగా మద్యం విధానంలో అక్రమాలు జరిగాయంటూ కూటమి సర్కారు పలువురిని అరెస్టు చేసింది. ఈ కేసు అసలు ఉద్దేశం మాజీ సీఎం వైఎస్ జగన్ ను ఇరికించడమే అయినా.. ఇంకా ఆయన వరకు వెళ్లలేదు. అయితే, ఈలోగానే వైఎస్ జగన్ పై చీలి సింగయ్య మృతి ఘటనలో కేసు నమోదైంది.
గత బుధవారం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్లారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్లకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అయితే, ఈ పర్యటనకు పోలీసులు పలు ఆంక్షలు విధించారు. వందమంది మించకుండా వెళ్లాలని.. ఎస్కార్ట్ కాకుండా మూడు వాహనాలకే అనుమతి అని తేల్చిచెప్పారు. కానీ, వైఎస్ జగన్ స్థాయి నాయకుడు బయటకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా?
ఈ క్రమంలో ఆయన పర్యటన సందర్భంగా చీలి సింగయ్య అనే వ్యక్తి మరణించాడు. వైఎస్ జగన్ కాన్వాయ్ లోని వాహనం ఢీకొన్నట్లు తొలుత కథనాలు రాగా.. ఆదివారం నేరుగా జగన్ వాహనం కిందపడే సింగయ్య మరణించినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి జగన్ పై కేసు నమోదు చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
ఈ నెల 18న జగన్ పర్యటన సందర్భంగా గుంటూరులోని ఏటుకూరు రోడ్డులో ప్రమాదం జరిగిందని ఎస్పీ తెలిపారు. రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో ఉన్న సింగయ్యను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. సింగయ్య భార్య లూర్దు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని.. సీసీ టీవీ ఫుటేజీ, డ్రోన్ సీన్లు, ప్రత్యక్ష సాక్షులు తీసిన వీడియోలను పరిశీలించి.. జగన్ వాహనం కిందే సింగయ్య పడినట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు. దీంతో సెక్షన్లు మార్చి కేసు నమోదు చేశామన్నారు. వైఎస్ జగన్ తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, పీఏ నాగేశ్వరరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనీలపైనా కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి సత్తెనపల్లి వెళ్లేందుకు 14 వాహనాలకు అనుమతి ఇచ్చామని.. కానీ ఆయన కాన్వాయ్ మొదలైనప్పుడు 50 వాహనాల్లో ర్యాలీగా వచ్చారని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాగా, సింగయ్య చనిపోయింది ప్రయివేటు కారు కింద పడి అని ఘటన జరిగిన రోజు ఎస్పీ చెప్పారు. దీనిపై ఆయనపై మాట్లాడుతూ.. అప్పటికి ఉన్న సమాచారం ప్రకారం అలా చెప్పినట్లు వివరించారు. డ్రోన్లు, స్థానికులు వీడియోల ఆధారంగా ఇప్పుడు వైఎస్ జగన్ తదితరులపై కేసు నమోదు చేశామన్నారు.