నూజివీడు, మార్చి 5: పీజీ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న జీవో నెంబర్ 77ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. నూజివీడు పట్టణంలోని కృష్ణ యూనివర్సిటీ పీజీ సెంటర్‌లో ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా నాయకత్వంలో నూతన జాతీయ విద్యా విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. సాయికుమార్, ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివకుమార్ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం వల్ల విద్యార్థులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.
పాండమిక్ సమయంలో విద్యార్థులు ప్రశ్నించే అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ విద్యా విధానాన్ని అమలు చేసిందని విమర్శించారు. ఈ విధానం వల్ల ప్రభుత్వ విద్యను బలహీనపరచి, కార్పొరేట్ విద్యాసంస్థలకు అనుకూలంగా మారుస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవుతోందన్నారు.
పాఠ్యపుస్తకాలలో స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను తొలగించి ఇతర సంస్థల చరిత్రను చేర్చడం ద్వారా విద్యార్థుల ఆలోచనలను ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికే నూతన విద్యా విధానం అమలుతో ఆంధ్రప్రదేశ్‌లో వేలాది పాఠశాలలు మూతపడ్డాయని తెలిపారు.
మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సును నాలుగు సంవత్సరాలకు పెంచి, మేజర్–మైనర్ సబ్జెక్టుల పేరుతో విద్యా వ్యవస్థను సంక్లిష్టం చేశారని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో కొన్ని విభాగాలను “మ్యాజర్” పేరుతో మూసివేస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కనీస మౌలిక వసతులు ఉండాల్సిన అవసరం ఉందని, అయితే కృష్ణా యూనివర్సిటీ పీజీ సెంటర్‌లో హాస్టల్ వసతి లేకపోవడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.








