Hot Posts

6/recent/ticker-posts

కృష్ణమ్మ పరవళ్లు- శ్రీశైలానికి భారీ వరద


మహారాష్ట్ర, కర్ణాటక సహా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల కృష్ణానది జలకళను సంతరించుకుంది. వరదనీటితో పోటెత్తుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గరిష్ఠస్థాయి నీటిమట్టాన్ని అందుకుంది.

దీనితో 10 గేట్లను ఎత్తివేశారు అధికారులు. వరద నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల గేట్లను ఎత్తివేయడం ఈ సీజన్ లో ఇది రెండోసారి. దీని ప్రభావం నంద్యాల జిల్లా శ్రీశైలం రిజర్వాయర్ పై భారీగా పడుతోంది. శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఈ భారీ రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది.

మహారాష్ట్ర, కర్ణాటకల్లో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. దీని ప్రభావంతో అటు గోదావరి, ఇటు కృష్ణానదికి వరద పోటుకు గురయ్యాయి. భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. కృష్ణా ఉపనదులు ఘటప్రభ, మలప్రభ, భీమా, తుంగ, భద్ర సైతం పొంగిపొర్లుతున్నాయి

కర్ణాటకలోని ఉత్తర కన్నడ, బెళగావి, హవేరి, విజయపురా, బాగల్‌కోటె, కలబురగి, బళ్లారి.. వంటి జిల్లాల్లో అతి భారీగా వర్షాలు కురిశాయి. ఆయా ప్రాంతాలన్నీ కూడా కృష్ణా బేసిన్ పరిధిలోకి వచ్చేవే. అటు మహారాష్ట్రలోనూ కృష్ణా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి.

ఫలితంగా కృష్ణానది ఉరకలేస్తోంది. కర్ణాటకలో దీనిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఆలమట్టి, నారాయణ్‌పూర్ ప్రాజెక్టులు గరిష్ఠ నీటి మట్టానికి చేరుకున్నాయి. దీనితో కొద్ది రోజుల కిందటే వాటి గేట్లను ఎత్తివేశారు కర్ణాటక జలవనరుల అధికారులు. లక్షకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

దీని ప్రభావం తెలంగాణపై పడింది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుకుంటోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. శ్రీశైలం రిజర్వాయర్ క్రమంగా నిండుతోంది. ప్రస్తుతం 60,587 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతోంది. ఇదే తాకిడి మున్ముందు కూడా కొనసాగితే.. మూడు నాలుగు రోజుల్లో ఇన్ ఫ్లో లక్ష క్యూసెక్కులకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తోన్నారు.

శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 854 అడుగులకు చేరుకుంది. 216 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉందీ జలాశయానికి. ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోలేదు. సుమారు 90 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now