ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఖరారయ్యారు. పార్టీ నాయకత్వం ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసు కుంది. అయితే, విధానపరంగా అధ్యక్షుడి ఎంపిక కోసం ఈ రోజు షెడ్యూల్ విడుదల చేస్తున్నారు. రెండు రోజులు నామినేషన్ల స్వీకరణ తరువాత.. జూలై 1న కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. ఈ పదవి కోసం పలువురు ముఖ్య నేతలు రేసులో ఉన్నారు. చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. అయితే, మోదీ - షా ద్వయం ఏపీలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వంలో ఉండటం.. భవిష్యత్ రాజకీయాలకు అనుగుణంగా అధ్యక్షుడి పైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొత్త అధ్యక్షుడిగా
ఏపీలో మారుతున్న రాజకీయాల వేళ బీజేపీ నాయకత్వం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. పార్టీ రాష్ట్ర పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే దాని పైన పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అధికారిక ప్రక్రియలో భాగంగా ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతోంది. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు అధ్యక్ష పగ్గాలు దక్కించుకునేందుకు తుది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు ఆదివారం(29వ తేదీ) షెడ్యూల్ విడుదల చేస్తామని, 30న నామినేషన్లు స్వీకరించి అదే రోజు సాయంత్రానికి ఉపసంహరణ గడువు విధించారు. జూలై 1న రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. 2023, జూలైలో రాష్ట్ర బీజేపీ సారథ్యం చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరిని మార్చబోతున్నట్లు ప్రచారం సాగుతుండగా.. ఆమెను కొనసాగించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
రేసులో ముఖ్యులు
ఏపీ నుంచి దాదాపు పది మంది వరకు ఆశావాహులు పార్టీ అధ్యక్షుడి పదవి కోసం పోటీ లో ఉన్నారు. వారిలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థ సారథి, విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. బీసీ వర్గానికి బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత ఇస్తోంది. అయితే.. ఇప్పటికే రాయలసీమకు చెందిన బీసీ నేత సత్య కుమార్ కు మంత్రిని చేసారు. రెండు రాజ్యసభకు సీట్లు కూడా బీసీ(ఆర్. కృష్ణయ్య, పాకా సత్యనారాయణ)లకే ఇచ్చారు. దీంతో.. ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలు బీసీ నేతకు ఇస్తారా అనేది సందేహంగా మారుతోంది. కాగా, రాయలసీమకు చెందిన రెడ్డి వర్గానికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనే ఆలోచనలో ఢిల్లీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఇద్దరిలో ఎవరికి
బీసీ నేతకే ఇవ్వాలని పార్టీ నిర్ణయిస్తే ఉత్తరాంధ్ర నుంచి పీవీఎన్ మాధవ్ లాంటి నేతకు అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీ ముఖ్యులతో చర్చించి అభిప్రాయాలు తీసుకున్న రాష్ట్ర పార్టీ సహ ఇన్‌చార్జి శివప్రకాశ్‌కు కొందరు ఆశావాహులు తమకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిసింది. రెడ్డి వర్గానికి ఇస్తే.. సీమకు చెందిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకు ఎలాంటి పదవీ దక్కలేదు. వైసీపీ తో కూటమిగా రాజకీయం పోరాటం సాగిస్తున్న వేళ కిరణ్ కుమార్ రెడ్డి కి అవకాశం ఉంటుం దనే చర్చ ఉంది. అయితే, పురందేశ్వరి విషయంలో పార్టీ నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. ఢిల్లీ వర్గాల సమాచారం మేరకు... మాజీ సీఎం కిరణ్ కు ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీంతో, ఈ రెండు రోజులు పార్టీ అధ్యక్ష పగ్గాల పైన సస్పెన్స్ కొనసాగనుంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi