Hot Posts

6/recent/ticker-posts

బీజేపీ సభ్యత్వంలో కొత్త మైలురాయి... 14 కోట్లు దాటిన సంఖ్య


14 కోట్ల మార్కును దాటిన బీజేపీ ప్రాథమిక సభ్యుల సంఖ్య

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ వెల్లడి

గతేడాది అక్టోబర్ 16న ప్రధాని మోదీ తొలి క్రియాశీలక సభ్యుడిగా చేరిక

బూత్ స్థాయి కార్యకలాపాల వల్లే ఈ ఘనత సాధ్యమైందన్న సంతోష్

క్రియాశీలక సభ్యుడిగా మారాలంటే కనీసం 50 మందిని చేర్పించాలన్న నిబంధన

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. పార్టీ ప్రాథమిక సభ్యుల సంఖ్య 14 కోట్లు దాటినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ప్రకటించారు. ఈ ఘనత సాధించడం వెనుక బూత్ స్థాయి కార్యకర్తల కృషి ఎంతో ఉందని ఆయన కొనియాడారు.

ఈ విషయంపై బీఎల్ సంతోష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ "భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వం 14 కోట్ల మార్కును దాటింది. ఇది గొప్ప విజయం. ప్రతి బూత్ స్థాయి కార్యకర్త కృషి అమోఘం. మేము భారీ ప్రచార కార్యక్రమాలను నిలిపివేసినప్పటికీ, బూత్ స్థాయి కార్యకలాపాల ద్వారా 14 కోట్ల సభ్యత్వ మార్కును దాటగలిగాం," అని తెలిపారు.

గత ఏడాది అక్టోబర్ 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్టీ దేశవ్యాప్త 'యాక్టివ్ సభ్యత్వ ప్రచారం'లో తొలి క్రియాశీల సభ్యుడిగా చేరిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ సభ్యత్వ ప్రచార కన్వీనర్ వినోద్ తావ్డే సమక్షంలో జరిగింది. ఇది పార్టీ చేపట్టిన 'సంఘటన్ పర్వ్ సభ్యత్వ ప్రచారం-2024'లో తదుపరి దశగా ప్రారంభమైంది. ఆ సమయంలో ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఎక్స్‌లో పంచుకుంటూ, బీజేపీలో తొలి యాక్టివ్ సభ్యుడిగా చేరడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.

క్రియాశీల సభ్యుడు కావడానికి ఉండాల్సిన అర్హతలను కూడా ప్రధాని మోదీ వివరించారు. "ఒక కార్యకర్త యాక్టివ్ సభ్యుడిగా అర్హత సాధించాలంటే ఒక బూత్ లేదా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కనీసం 50 మంది కొత్త సభ్యులను నమోదు చేయించాలి. దీనివల్ల వారు మండల కమిటీ, పార్టీలో ఉన్నత స్థాయి పదవులకు పోటీ చేయడానికి అర్హులవుతారు. భవిష్యత్తులో పార్టీకి వివిధ హోదాల్లో సేవలందించేందుకు ఈ కార్యకర్తలకు విస్తృత అవకాశాలు కల్పిస్తాం" అని ప్రధాని  తెలిపారు.

బీజేపీ జాతీయ సభ్యత్వ ప్రచారాన్ని తొలుత గత ఏడాది సెప్టెంబర్ 2న పార్టీ కేంద్ర కార్యాలయ విస్తరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రారంభించారు. 'సంఘటన్ పర్వ్ సభ్యత్వ ప్రచారం-2024' పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో 2024 అక్టోబర్ 15 నాటికి సభ్యుల సంఖ్య తొమ్మిది కోట్లు దాటింది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే బీజేపీ రెండు కోట్ల మంది సభ్యులను కలిగి ఉన్నట్లు ఆ పార్టీ పేర్కొంది. సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదటి, రెండవ దశలు ముగియడంతో పార్టీ క్రియాశీల సభ్యత్వ సంఖ్యను మరింత పెంచే లక్ష్యంతో మూడవ దశ ప్రారంభమైంది.
WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now