ANDRAPRADESH: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. BY: BCN TV NEWS సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులకు సంబంధించిన కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అరెస్ట్ నుంచి రెండు వారాల పాటు మధ్యంతర ఉపశమనం కల్పించిన సుప్రీంకోర్టు, ఈలోపు ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది.
విచారణ సందర్భంగా జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం సజ్జల భార్గవరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులపైనా తీవ్ర అభ్యంతరం తెలిపింది. "సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదనుకున్నారా? ఏ ఆలోచనతో పోస్టులు పెట్టారో ఆ మాత్రం తెలుసుకోలేమా? ఆ పోస్టులు భరించరాని స్థాయికి వెళ్లాయి. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇలాంటి వాటిని వ్యవస్థ క్షమించదు.. తప్పక శిక్షిస్తుంది. సోషల్ మీడియా దుర్వినియోగం కేసుల్లో త్వరగా బెయిల్ వస్తుందనుకోవద్దు. అలా బెయిల్ వస్తే ప్రతి ఒక్కరూ ఇష్టారీతిన వ్యవహరిస్తారు" అని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
భావప్రకటనా స్వేచ్ఛకు హద్దులు ఉంటాయని, దానిని దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని ఈ తీర్పు నొక్కి చెబుతోంది. గత గురువారం (మే 15వ తేదీన), జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట సజ్జల భార్గవ్ పిటిషన్‌పై విచారణ జరిగింది. సీనియర్ న్యాయవాదులు అందుబాటులో లేకపోవడంతో కేసును వాయిదా వేయాలని సజ్జల భార్గవ్ తరపు న్యాయవాది సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. అయితే, ఇది ఎస్సీ, ఎస్టీ కేసు కావడంతో ట్రయల్ కోర్టుకే వెళ్లాలని, ఇక్కడ విచారణ సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీనియర్ న్యాయవాది వాదనల కోసం ఈ కేసును వచ్చే వారానికి వాయిదా వేసింది.