ANDRAPRADESH, NELLURU: 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న అనూహ్య పరాజయం తర్వాత, పార్టీలో అంతర్గత విశ్లేషణలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. BY: PASCHIMA VAHINI ఒకప్పుడు 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాలతో తిరుగులేని మెజారిటీతో ఉన్న వైసీపీ, తాజాగా కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి గల కారణాలపై నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో, వైసీపీ సీనియర్ నేత, నెల్లూరు జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పొత్తు పెట్టుకోకపోవడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పని ఆయన కుండబద్దలు కొట్టారు.
తన మనసులో ఉన్న మాటను ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పే నేతగా పేరున్న నల్లపురెడ్డి, మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అవకాశం లభిస్తే బీజేపీతో కలిసి వెళ్లాలని తాను కోరుకుంటున్నానని చెప్పిన ఆయన, ఇదే విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి కూడా తీసుకెళ్తానని అన్నారు. -బీజేపీతో వెళ్లడంలో తప్పేంటి? గత ఐదేళ్ల వైసీపీ పాలనలో (2019-2024) కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసీపీ లోకసభ, రాజ్యసభల్లో సంపూర్ణ మద్దతు ఇచ్చిందని నల్లపురెడ్డి గుర్తు చేశారు. పార్లమెంట్‌లో కేంద్రానికి అన్ని విధాలా అండగా నిలిచిన పార్టీ, ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని వెళితే తప్పేముందని ఆయన ప్రశ్నించారు.
2024 ఎన్నికలకు ముందు బీజేపీ తమతో దోస్తానా కోసం ఎదురుచూసిందన్న వార్తలు వచ్చాయని నల్లపురెడ్డి ప్రస్తావించారు. అది నిజమైతే, బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా జగన్ పెద్ద తప్పు చేశారని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి అండగా నిలిచిన వైసీపీ, ఎన్నికల్లోనూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే అది సహజ పరిణామమే అవుతుందని ఆయన వాదించారు. -చంద్రబాబుపై మోదీ, షాలకు నమ్మకం లేదు! ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కూడా నల్లపురెడ్డి ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చంద్రబాబుపై ఏమాత్రం నమ్మకం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. గతంలో చంద్రబాబు మోదీని లెక్కలేనన్ని సార్లు ఘాటుగా విమర్శించారని, అమిత్ షాపై ఏకంగా రాళ్లు, చెప్పులు వేయించారని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో బీజేపీ అగ్ర నాయకత్వం వాస్తవానికి వైసీపీతో పొత్తుకే ఎక్కువ ఆసక్తి చూపించిందని, అయితే వైసీపీ వైపు నుంచి ఆ దిశగా గట్టి అడుగులు పడకపోవడంతోనే బీజేపీ చివరకు టీడీపీ, జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందని నల్లపురెడ్డి విశ్లేషించారు. మొత్తంగా చూస్తే, భవిష్యత్తులో బీజేపీతో పొత్తుకు అవకాశం వస్తే, వైఎస్ జగన్ దానిని తప్పనిసరిగా అంగీకరించాలని నల్లపురెడ్డి తన మనసులోని మాటను గట్టిగానే వ్యక్తం చేశారు. పార్టీ ఎదురైన ఘోర పరాజయం నేపథ్యంలో, నల్లపురెడ్డి వంటి సీనియర్ నేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం వైసీపీలో అంతర్గత చర్చకు దారి తీసే అవకాశం ఉంది. ఈ వ్యాఖ్యలపై వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
బీజేపీ వైపు అడుగులు వేస్తున్న కోవూరు @YSRCParty మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి❓#byebyejagan pic.twitter.com/gwVjK5Vs41
— మన ప్రకాశం (@mana_Prakasam) May 17, 2025