ANDRAPRADESH, AMARAVATHI: మద్యం స్కాంలో దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక పోలీసు బృందం కీలక ఆధారాలు సేకరించిందని ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో పాత్రధారులు, సూత్రధారులను ప్రశ్నించిన పోలీసు అధికారులు.. స్కాంలో సంపాదించిన డబ్బు ఎక్కడికి చేర్చారనే కీలక అంశంపైనే ఎక్కువగా ఫోకస్ చేశారంటున్నారు. ఈ డబ్బు అంతా వైసీపీలోని ‘ముఖ్య’నేతకు చేరినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు. సిట్ లో కీలక సభ్యుడు అయిన ఓ అధికారి చెప్పిన విశ్వసనీయ సమాచారం ప్రకారం మద్యం స్కాంలో నిందితులు అంతా మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు చెబుతున్నట్లు తెలిపారు. తన పేరు బయట పెట్టేందుకు ఇష్టపడని సదరు అధికారి స్కాంలో మాజీ సీఎం జగన్ పాత్రపై దర్యాప్తు జరుగుతోందని, ప్రభుత్వ ఆదేశాలతో కేసు నమోదు చేసేదీ? లేనిదీ? త్వరలో తెలుస్తుందని చెప్పారు. దీంతో మాజీ సీఎం జగన్ చుట్టూ ఉచ్చుబిగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
మద్యం స్కాంలో విచారణ వేగవంతం చేసిన పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఆధారాలు బయటపడితే స్కాం డొంక మొత్తం కదులుతోందని అంటున్నారు. మద్యం పాలసీని అడ్డుపెట్టుకుని కీలక నాయకుడు వేల కోట్లు దోచుకున్నారని సిట్ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం మద్యం అమ్మకాలు ఎలా చేశారు? ఎవరికి ఆర్డర్లు ఇచ్చారు? ఏ ప్రాతిపదిక ఆర్డర్లు ఇచ్చారు? ఎక్కువగా ఒకటి రెండు డిస్టలరీలకే ప్రయోజనం లభించేలా ఎందుకు వ్యవహరించారన్న విషయాలపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఇప్పుడు.. స్కాం ద్వారా పోగేసిన డబ్బు ఎక్కడికి తరలించారు? ఎవరి ద్వారా నగదు చేతులు మారిందనే విషయాలపై కూపీ లాగుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం అరెస్టు అయిన నిందితులు చెప్పిన వివరాల ప్రకారం స్కాం సొమ్ము మొత్తం తాడేపల్లి ప్యాలెస్ కు చేరిందని సిట్ నిర్ధారించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటివరకు విచారించిన నలుగురు కూడా ‘ముఖ్య’ నేత పేరు చెప్పారని సిట్ అధికారులు చెబుతున్నారు. దీంతో స్కాంలో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న బిగ్ బాస్ గుట్టురట్టు అయినట్లేనని అంటున్నారు. అదేవిధంగా ఈ స్కాంతో తనకు సంబంధం లేదని చెబుతున్న వైసీపీకి చెందిన ఓ ఎంపీ పేరు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నట్లు చెబుతున్నారు.తొలుత ఆయన పాత్రపై సరైన ఆధారాలు లేకపోయినా, కేసు దర్యాప్తులో ఆ ఎంపీ పాత్రపై ప్రస్పుటమైన ఆధారాలు లభించాయని అంటున్నారు. స్కాంలో ఆయన పాత్రపై లోతుగా విచారించగా, ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుంచి సదరు ఎంపీ పాత్ర ఎక్కువగా ఉందని తేలినట్లు తెలిసింది.
‘‘ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. వాళ్లు కూటమి కడితే.. మనం ఎక్కువగా ఖర్చు చేయాల్సివుంటుంది. ఏదో ఒకటి చేసి డబ్బు పోగేయండి. మనోళ్లందరికీ సొమ్ములు చేరాలి’’ అని ముఖ్య నేత సూచనలతో మద్యం స్కాంలో వేల కోట్లు కమీషన్ గా సేకరించామని ఓ నిందితుడు వాంగ్మూలమిచ్చినట్లు చెబుతున్నారు. దీంతో మద్యం స్కాంలో ముఖ్యనేతపై చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని అంటున్నారు. అమరావతి పునఃనిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం చంద్రబాబు మద్యం స్కాంపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అప్పుడే స్కాంలో ‘ముఖ్యపాత్ర’ పోషించిన బిగ్ బాస్ పై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.