టి. నరసాపురం: క్రైస్తవ మత ప్రబోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని అతని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గురువారం మండలంలోని క్రైస్తవ సంఘాల నాయకులు, విశ్వాసులు శాంతియుత ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు.
మండలకేంద్రమైన టి. నరసాపురం హైస్కూల్ వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు.
ఈ ర్యాలీ ప్రదర్శన ను ఉద్దేశించి పాస్టర్ లు బి.అనిల్ కుమార్, కె. నిరీక్షణరావు, పి.ఏసుపాదం, డి.సామ్యుల్ రాజు పలువురు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి క్రైస్తవ సమాజానికి దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన మృతిపై క్రైస్తవులను అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఆయన మృతికి కారణాలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలన్నారు. క్రైస్తవుల పై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. సమాజ క్షేమం కోసం క్రైస్తవులు నిత్యం ప్రార్దిస్తారని అటువంటి వారిపై దాడులు చెయ్యడం బాధాకరమన్నారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్లు బి. బెసలేలు, సిహెచ్ హోషేయ, ఆర్ మోషే, బి. రమేష్, వై పాల్ చిన్నారావు, నవజీన్ పాల్, బి. కిషోర్, ప్రేమ్ కుమార్, ప్రసన్నకుమార్, శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.