Hot Posts

6/recent/ticker-posts

డ్వాక్రా గ్రూపుల్లోని నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులను చేసేందుకు ఉల్లాస్ కార్యక్రమం..



నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించేందుకు ఈనెల 16 నుండి 20వ తేదీ వరకు సర్వే..


ఏలూరు:  నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులను చేసేందుకు నిర్వహించే ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్, 16 నుండి ఏప్రిల్ 20వ తేదీ వరకు సర్వే నిర్వహించి జిల్లాలో నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించాలని ఇన్ చార్జి జిల్లా కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తెలిపారు.  

గురువారం స్ధానిక కలెక్టరేట్ లో జిల్లా వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమం పై జిల్లా స్థాయి కమిటీ సమావేశం  జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గుర్తించిన నిరక్షరాస్యులకు మే 5వ తేదీ నుండి సెప్టెంబరు 18వ తేదీ వరకు వాలంటరీ టీచర్లతో తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. 

అనంతరం సెప్టెంబరు నెలాఖరులో వారికి తుది పరీక్షలు నిర్వహించాలన్నారు. ఉల్లాస్ 2025-26 అక్షరాస్యతా కార్యక్రమంలో జిల్లాలో డిఆర్డిఏ, మెప్మా ఆధ్వర్యంలోని డ్వాక్రా గ్రూపుల్లో నిరక్షరాస్యులైన గ్రూపు మహిళలను అక్షరాస్యులుగా చేయడం జరుగుతుందన్నారు.  గత ఏడాది ఉల్లాస్ కార్యక్రమంలో మొదటి విడతగా 7,321 మందికి డిజిటల్ లిటరసీ, ఫైనాన్సియల్ లిటరసీ మరియు ఫంక్షనల్ లిటరసీ కార్యక్రమాన్ని డ్వాక్రా గ్రూపుల్లోని నిరక్షరాస్యులైన మహిళలకు ఏర్పాటు చేసి తరువాత పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు.  

సదరు పరీక్షకు 7,285 మంది  హాజరయి ఉత్తీర్ణత సాధించారన్నారు. అదే విధముగా 2025-26  సంవత్సరంలో 20,199 మంది నిరక్షరాస్యులైన మహిళలను డిఆర్డిఏ డ్వాక్రా గ్రూపులనుంచి 11,017 మంది , మరియు మెప్మా నుంచి 9,182 మంది నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా మార్చాలనే లక్ష్యంగా నిర్ణయించామన్నారు. కార్యక్రమము మొత్తం వయోజన విద్యా శాఖ వారి ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు. 

సమావేశంలో వయోజన విద్య ఏలూరు జిల్లా నోడల్ అధికారి కెవివి సత్యనారాయణ, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, మెప్మా పిడి హెప్సిబా, డిఇఓ వెంకట లక్ష్మమ్మ, ఐసిడిఎస్ పిడి పి. శారద,  డివిజనల్ పంచాయితీ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.