Hot Posts

6/recent/ticker-posts

పనీ పాటా లేని వారు కోటిన్నర మంది !


ANDRAPRADESH: పనీ పాటా ఏదైనా చేసుకో అని కాస్తా వయసు వచ్చిన వారికి ఇంట్లో పెద్ద వారూ చెబుతూ ఉంటారు. ఇది భారత్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ బిడ్డలను ఎంత పెద్ద వారుగా ఉన్నా తల్లిదండ్రులు చిన్నవారిగా చూస్తూ వారిని డైరెక్షన్ చేయాలని చూస్తారు. దాంతో వారు సొంతంగా ఆలోచించడం మానుకుంటారు. ఇక చాలా మంది తమకు నచ్చిన రంగంలో పని దొరికేంతవరకు కూడా ఖాళీగా ఉండడానికి ఇష్టపడతారు. మరికొందరు చదివింది తక్కువ అయినా తమకు పెద్ద జాబ్స్ కావాలని కోరుకుంటారు. ఇక ఈ రోజుకీ చూస్తే కనుక సంప్రదాయ చదువులు చదివిన వారు ప్రతీ ఊరిలో బోలెడు మంది కనిపిస్తారు వీరంతా విద్యావంతులుగా ఉంటారు. 


డిగ్రీలు చేతబట్టుకుని ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలు కావాలని కోరుకుంటారు. అయితే వీరికి టెక్నికల్ గా నాలెడ్జి ఉండదు, కాలానికి తగినట్లుగా నైపుణ్య శిక్షణలో ఆరితేరి తమ కాళ్ళ మీద నిలబడాలని ధ్యాస ఉండదు. ఇలా చాలా మంది నిరుద్యోగులుగానే ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇటీవల కాలంలో ఇంటింటి సర్వే జరిపించింది అని తెలుస్తోంది. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఏపీ జనాభా అయిదు కోట్ల పై మాటగా ఉంటే అందులో ఏ పనీ పాటా లేని వారు ఒక కోటీ 56 లక్షల మంది ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. 

ఏపీలోని మొత్తం 26 జిల్లాలలోని 2.67 కోట్ల మంది నుంచి వివరాలు సేకరిస్తే అందులో ఈ నంబర్ వచ్చిందని చెబుతున్నారు. ఇక ఈ జాబితాలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 7.24 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెబుతున్నారు. అత్యల్పంగా చూస్తే కనుక పార్వతీపురం మన్యం జిల్లాలో 3.38 లక్షల మంది ఉన్నారు. మిగిలిన జిల్లాలలో చూస్తే పల్నాడు జిల్లాలో 5.87 లక్షల మంది ఉంటే ఇతర జిల్లాలలో ఇదే తీరున మూడు నుంచి అయిదారు లక్షల మంది సగటున నిరుద్యోగులుగా తేలారు. వీరందరి వివరాలు సేకరించిన ప్రభుత్వం వీరి కోసం సరికొత్త కార్యక్రమాలను అమలు చేయాలని చూస్తోంది. 

వీరికి వారు కోరుకున్న రంగాలలో తగిన విధంగా శిక్షణ ఇవ్వడం టెక్నికల్ గా వారికి తగిన తర్ఫీదు ఇవ్వడం ద్వారా జీవితంలో ముందుకు తీసుకుని వెళ్ళాలని చూస్తోంది. ఇక వీరంతా తమ స్వయం ప్రతిభను పెంచుకోవాలని కోరుకుంటోంది. అదే విధంగా వీరిలో బాగా చదువుకున్న వారు తమ ఇంటి నుంచే పనిచేసుకునేలా వెసులుబాటు కల్పిస్తూ వారికి తగిన విధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. మరో వైపు చూస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి నేతలు ఎన్నికల ముందు చెప్పారు దానికి అనుగుణంగా అవసరమైన వారిని గుర్తించి వారికి ఈ పధకం అమలు చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా చెబుతున్నారని అంటున్నారు. 

నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఉంటుంది. అయితే వీటికి కూడా మార్గదర్శకాలను రూపొందించి అసలైన అర్హులను ఎంపిక చేసి ఆ భృతి కూడా వారు ఉద్యోగం సరైనది సంపాదించేందుకు వీలుగా దోహదపడేదిగా ఉండాలని భావిస్తోంది. మొత్తం మీద చూస్తే ఏపీలో నిరుద్యోగుల డేటా అయితే ప్రభుత్వం వాద్ద ఉంది అని అంటున్నారు.