ఏలూరు: సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన డా. బాబు జగజ్జీవన్ రామ్ నేటి తరానికి ఆదర్శనీయులని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. డా. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తో కలిసి స్థానిక ఓవర్ బ్రిడ్జ్ వద్ద డా. బాబు జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ డా. బాబు జగజ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారని, సమాజంలో అంటరానితనం, సామజిక అసమానతలు రూపుమాపేందుకు అలుపెరగని కృషి చేశారన్నారు. అటువంటి నాయకులను స్మరించుకుని వారి జీవితాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ డా. బాబు జగజ్జీవన్ రామ్ పేదల సంక్షేమానికి కృషిచేశారన్నారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనం రూపుమాపేందుకు తన జీవితాన్ని అంకితం చేసారని, వారు చూపిన బాటలో నేటి యువత నడిచి సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు.
కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జయప్రకాశ్, మైనారిటీల సంక్షేమ శాఖాధికారి ఎన్.ఎస్. కృపావరం, షెడ్యూల్డ్ కులాల సంఘాల నాయకులు పొలిమేర హరికృష్ణ, మెండెం సంతోష్ కుమార్, దాసరి ఆంజనేయులు, మేతర అజేయబాబు, కలపాల రవి, నేతల రమేష్ బాబు, ధనియాల శంకర్, ప్రభృతులు పాల్గొన్నారు.