-ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరులు
-ఉగాది - రంజాన్ సందర్భంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న టీ నర్సాపురం
టీ నర్సాపురం: మండల కేంద్రమైన టి. నరసాపురంలో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. పెద్ద ఎత్తున స్థానిక ముస్లింలు స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.
ముప్పయి రోజుల కఠోర (రోజా) ఉపవాస దీక్షల అనంతరం షవ్వాల్ నెల ప్రారంభం తొలి రోజున ఆదివారం రాత్రి ఆకాశంలో నెలవంక దర్శనంతో సోమవారం రోజున ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. మండుటెండలు సైతం లెక్కచేయకుండా సహరి- ఇఫ్తార్ లతో నెల రోజులపాటు ఉపవాస దీక్షలు కొనసాగించిన ముస్లింలు నేడు ఈద్-ఉల్-ఫితర్ రోజున ఆధ్యాత్మిక ఉత్సవంలో చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రత్యేక ప్రార్థనల్లో టీ నర్సాపురం మసీదు ఇస్లాం మత ప్రబోధకులు ముంతాజ్ అన్సారీ, హఫీజ్ నదీమ్ రంజాన్ పండుగ ప్రత్యేకతను ముస్లింలకు వివరించారు. పేదవాడి ఆకలిని గుర్తించి ఫిత్రా, జకాత్ లతో పేదలకు దానధర్మాలు చేయాల్సిన బాధ్యతను మహమ్మద్ ప్రవక్త(స) ప్రవచనాలను ముస్లింల బాధ్యతలను, ప్రత్యేకించి పరమత సహనాన్ని ఈ సందర్భంగా తమ సందేశంలో ముస్లింలకు గుర్తు చేశారు. నమాజు పూర్తి చేసి పరస్పరం ముస్లిం సోదరులు అలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
అనంతరం స్థానిక ఖబరస్తాన్ చేరుకుని మృతిచెందిన వారు ఆత్మ లకు శాంతి కలగాలని, వారిని క్షమించి, వారికి స్వర్గ ప్రాప్తి కలిగించాలని దేవుని వేడుకున్నారు. రంజాన్ సందర్భంగా నూతన వస్త్రాలతో అత్తరు-సెంటు సువాసనలతో ముస్తాబైన ముస్లిం సోదరులు రంజాన్ స్పెషల్ ప్రత్యేక వంటకం సేమియా (ఖీర్ ఖుర్మా) బంధువులతో హిందూ మరియు క్రైస్తవ మిత్రులతో కలిసి విందు ఆరగించారు. ఆదివారం ఉగాది సోమవారం రంజాన్ సందర్భంగా టి నరసాపురంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో మత పెద్దలు షేక్ అబ్బాస్, షేక్ షరీఫ్, సామాజిక కార్యకర్త యస్ డి నా సర్ పాషా, షేక్ అబూబకర్, షేక్ లాలు, సబ్ ఎడిటర్ షేక్ యాసీన్ ఖుషీన్, సయ్యద్ మీర్ సాహెబ్(గులాబీ), ఖాదర్, సయ్యిదు, షేక్ కరీముల్లా, ఉస్మాన్ సాహెబ్, నవాబ్, షమ్మీకపూర్, షేక్ వజీర్, సయ్యద్ అమానుల్లా, అబ్దుల్లా, ఇషా వలి, షేక్ రహీం, ఉమర్, హేర్షద్ బాబు, హుమాయున్, అమీర్ జానీ, బాబి, మౌలానా, బహుదూర్, తదితరులు పాల్గొన్నారు.