విశాఖ ప్రతినిధి: దక్షిణ నియోజకవర్గం ఉమ్మడి పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో పత్రికా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 కీలక హామీలకు సంతకాలు చేయడంతో లబ్ధిదారులతో కలసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ నగరాన్ని ఆర్థిక రంగంలో దేశంలో మొదటి స్థానం పొందేలా సీఎం చంద్రబాబు అభివృద్ది చేస్తారని అన్నారు. దక్షిణ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు అహర్నిశలు కృషి చేస్తానని, దానిలో భాగంగా పలు అంశాలపై ఇప్పటికే చర్యలు చేపట్టామని అన్నారు. ప్రతి లబ్ధిదారునికి సంక్షేమం పొందేలా ప్రజల వద్దకే పాలన నినాదంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో విశాఖ ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
వ్యాపారులకు గత ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు ఈ ప్రభుత్వంలో ఉండవని హామీ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర మంత్రి వర్గం కూర్పు అద్భుతంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన ముఖ్యమైన హామీలు అమలు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు ధన్యవాదాలు తెలిపారు. మెగా డిఎస్సి పై చంద్రబాబు మొదటి సంతకం చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
Staff Reporter
Anil Kumar
Visakhapatnam