ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. వీటిలో ప్రధానంగా పింఛను పెంపుదలను వచ్చే నెల 1 నుంచి అమలు చేయాలి. వలంటీర్లను కొనసాగించాలి. వారికి వేతనంగా రూ.10వేలు ఇవ్వా లి. వీటికి మించి.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి. అంతేకాదు.. ప్రతి 18 ఏళ్లు నిండిన మహిళకు రూ.1500 చొప్పున నెల నెలా ఇవ్వాలి. వీటిలో ఏఒక్కటైనా వచ్చే ఆరు మాసాల లోపు ఇవ్వకపోతే.. ఇబ్బంది తప్పదు. ప్రతిపక్షాలకు చాన్స్ ఇచ్చినట్టే!
పోనీ.. వీటిని ఇద్దామని అనుకుంటే.. ఖజానాలో సొమ్ములేదు. గత ప్రభుత్వం కేవలం 5 వేల కోట్లు మాత్రమే వదిలి వెళ్లింది. ఇది ఏమూలకూ చాలదు. మరి ఇప్పుడు ఏం చేయాలి. నిజానికి ఇప్పటికే ప్రకటించిన పింఛను పెంపు, జీతాలను 1నే ఇవ్వడం, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పింఛన్లు 1నే ఇవ్వడం వంటివాటికి కనీసంలో కనీసం 12 వేల కోట్లు కావాలని లెక్క తేలింది. దీంతో ఈ సొమ్ము కోసం.. చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక్కడే అసలు సమస్య తెరమీదికి వచ్చింది. ఇప్పటికిప్పుడు హామీలు అమలు చేసేందుకు సొమ్ములు కావాలి. ఈ సొమ్ములు తేవాలంటే.. అప్పులు చేయాలి. అయితే.. గతంలో జగన్ అప్పులుచేసినప్పుడు.. చంద్రబాబు పదే పదే విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని చెప్పారు. శ్రీలంక చేస్తున్నారని కూడా అన్నారు. దీంతో ఇప్పుడు అధికార పీఠం దక్కించుకున్న వెంటనే అప్పులు చేస్తే.. చంద్రబాబు కూడా.. అప్పులు చేశారన్న బ్యాడ్ నేమ్ రావడం ఖాయం. ఈ విషయంలో వెనక్కి తగ్గితే.. పథకాలు నిలిచిపోతాయి.
ఈ పరిణామం నుంచి బయటపడడం చంద్రబాబుకు సంకటంగా మారింది. అందుకే.. ఇతర పథకాలను ప్రస్తుతానికి నిలిపివేసినా.. వచ్చే 1న వేతనాలు, సామాజిక భద్రతా పింఛన్లను అయినా.. పంపిణీ చేయాల ని భావిస్తున్నారు. దీంతో అప్పులు చేయాల్సివస్తోంది. ఈ విషయాన్ని ఆయన దాచలేక.. అలాగని బహిరంగంగా చెప్పలేక.. ముందుకు వెళ్తే.. గొయ్యి..వెనక్కి వస్తే నుయ్యి అన్నచందంగా చంద్రబాబు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరి దీనిని ప్రతిపక్షాలు యాగీ చేస్తాయా? అలా చేస్తే.. అధికార పక్షం ఎలా రెస్పాన్స్ ఇస్తుంది అనేది చూడాలి.