ఇదే సమయంలో రకరకాల కారణాలతో వారిలో ఎక్కువ మంది చేస్తున్న ఉద్యోగాలను వదిలేస్తున్నారని అంటున్నారు. గతకొంతకాలంగా ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రకరకాల కారణాలతో వారిలో ఎక్కువ మంది చేస్తున్న ఉద్యోగాలను వదిలేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో సుమారు 34శాతం మంది ఉద్యోగాలను వదిలేస్తున్నారని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది! ఈ విషయంలో మగవారి సంఖ్య చాలా తక్కువగానే ఉంది!
వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన బాధ్యతల్ని సమతుల్యం చేసుకోలేక సుమారు 34 శాతం మంది మహిళలు తమ ఉద్యోగాలను వదిలేస్తున్నారని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో మగవారి సంఖ్య కేవలం 4% మాత్రమే ఉండటం గమనార్హం. మహిళలు ఈ స్థాయిలో ఉద్యోగాలు వదిలిపెట్టడానికి పైన చెప్పుకున్నట్లు వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతల్ని సమతుల్యం చేసుకోలేకపోవడం మాత్రమే ఇందుకు కారణం కాదని తెలుస్తుంది.
ఇందులో భాగంగా... మహిళల వైవాహిక స్థితి, వయసు, నివాస ప్రాంతాలను కూడా హెచ్.ఆర్. మేనేజర్లు పరిగణలోకి తీసుకోకపోవడం కూడా మహిళలు భారీ సంఖ్యలో ఉద్యోగాలను వదిలేయడానికి గల ఇతర కారణాలుగా చెబుతున్నారు. ఈ విధంగా కుటుంబ బాధ్యతల వలన ఉద్యోగాలు వదిలేస్తున్నవారిలో ఎక్కువమంది 30 - 35 సంవత్సరాల మధ్య వయసు వారే అని అంటున్నారు. తాజా వివరాలను బట్టి చూస్తే... 30 - 35 సంవత్సరాల సమయంలో మహిళలు ఉద్యోగాలు వదిలేయడానికి పిల్లల సంరక్షణ కూడా ఒక కారణం అని తెలుస్తుంది. ఇదే సమయంలో మహిళలు ఇంటి బాధ్యతల విషయంలో ఎంత కీలకంగా ఉంటారనేది తెలిసిన సంగతే! జాతీయ గణాంకాల కార్యాలయం చెబుతున్న వివరాల ప్రకారం... మహిళలు ఇంటి పనులకోసం రోజుకి ఏడు గంటలకు మించి సమయం వెచ్చిస్తున్నారట!
ఇదే సమయంలో ఒకసారి జాబ్ వదిలేసిన తర్వాత.. తిరిగి జాయిన్ అయ్యే విషయంలో కూడా మహిళలకు అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని మరొక సర్వేలో తేలిందని తెలుస్తుంది. తిరిగి జాబ్ లో చేరడానికి తమ ఉద్యోగ పరమైన స్కిల్స్ ని పెంచుకోవాల్సి రావటంతోపాటు.. వారు మానేసిన సమయంలో జరిగిన సాంకేతిక అభివృద్ధిని అర్థం చేసుకోవాల్సిన అవసరం వంటివి వారు తిరిగి ఉద్యోగాల్లో చేరకుండా అడ్డుకుంటున్నాయని అంటున్నారు. ఇటువంటి సమస్యలతో ఉద్యోగాలు వదిలేసినవారిలో సుమారు 70శాతం మంది మహిళలు ఈ విధంగా బాధపడుతున్నారని తెలుస్తుంది.