Chittoor: హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై వైఎస్సార్ సీపీ చర్యలు తీసుకుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు.. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించి వేరే పార్టీ అధ్యక్షుడ్ని కలిశారంటూ ఆయనపై వైసీపీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం హైదరాబాద్‌కు వచ్చి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఆయనతో కాసేపు రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇటీవల చిత్తూరు అసెంబ్లీ ఇంఛార్జ్‌గా విజయానందరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. తనను కాదని అధిష్టానం వేరొకరికి తన నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడంతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ వీడాలని భావించిన ఎమ్మెల్యే శ్రీనివాసులు ఈ క్రమంలో జనసేనాని పవన్ తో సమావేశమై చర్చించారు. మరోవైపు వైసీపీ సైతం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో.. ఎమ్మెల్యే శ్రీనివాసులు జనసేనలో చేరనున్నారు. త్వరలోనే జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం.
ఓ వైపు వైనాట్ 175 నినాదంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఇంఛార్జ్‌ల వరుస జాబితాలు విడుదల చేస్తున్నారు. మరోవైపు తమ సీటు గల్లంతు కావడంతో అసంతృప్తులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోరిన చోట సీటు రాకున్నా కొందరు అధిష్టానానికి ఆ మాట స్పష్టం చేస్తున్నారు. ఇదివరకే కొందరు నేతలు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరగా.. తాజాగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు తనను ఇంఛార్జ్‌గా ప్రకటించక పోవడం, టికెట్ పై స్పష్టమైన హామీ రాకపోవడంతో వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్‌కు వచ్చి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పవన్‌తో భేటీ అయిన ఎమ్మెల్యే శ్రీనివాసులను వైసీపీ సస్పెండ్ చేసింది. దాంతో జనసేనలో చేరికకు ఆయన సిద్ధమయ్యారు.