Hyderabad: మరికొన్ని రోజుల్లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కచ్చితంగా ఓడిపోతుందన్నారు. ఏపీ సీఎం జగన్ (YS Jagan) పార్టీ మామూలుగా కాదు, భారీ తేడాతో ఓటమి చెందుతుందని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
ఏపీ ఎన్నికల ఫలితాలపై పీకే జోస్యం
హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తథ్యమని, భారీ తేడాతో ఓడిపోతుందని పీకే చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఉచితాలు అంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం కాదని, ఉద్యోగాల కల్పన, అభివృద్ధిపై సైతం ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నారు. కేవలం పథకాలతో ఓట్లు రాలవని, ప్రజల వద్దకే అన్నీ అందుతున్నాయని చెప్పుకోవడం కాదని, డెవలప్‌మెంట్ కోసం ముందడుగు వేయాలన్నారు. జగన్ మిస్టెక్ చేశారని, దాంతో రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో వైసీపీ విజయానికి కృషి..
2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యూహకర్తకు పనిచేశారు. వైఎస్ జగన్ కు అఖండ విజయాన్ని అందించి సీఎం చేశారు. గత ఎన్నికల్లో సీఎం జగన్ అత్యధిక స్థానాలతో విజయం సాధిస్తారన్న పీకే అంచనా నిజమైందని తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకుగానూ 151 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారు. ఆపై ఢిల్లీ, కోల్‌కతా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిశోర్ అంచనాలు నిజమయ్యాయి. త్వరలో జరగనున్న ఏపీ ఎన్నిక్లలో జగన్ పార్టీ భారీ తేడాతో ఓటమి చెందుతుందని అభిప్రాయపడ్డారు. దాంతో ఏపీ ఎన్నికల్లో విజయం సాధించి టీడీపీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆ పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు.
ప్రస్తుతం రోజులు మారాయని, యువత అధికంగా ఉన్నారని పేర్కొన్న పీకే.. వారు ఉద్యోగాల కోసం చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రం అభివృద్ది చెందితే జాబ్స్ వస్తాయని వారు కలలు కన్నారు. కాగా, ఉచితాలపై మాత్రమే ఫోకస్ చేసిన జగన్ కొన్ని విషయాల్లో మిస్టేక్ చేశారని ప్రశాంత్ కిశోర్ చెప్పుకొచ్చారు. దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఇస్తుందన్నారు.