Hot Posts

6/recent/ticker-posts

కంచుకోటను బద్దలు కొడుతోందెవరు?


 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. ప్రధాన పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన వ్యూహ ప్రతివ్యూహాలు రచించుకొని ముందుకు సాగుతున్నాయి. రాష్ట్రంలో కీలకమైన శ్రీకాకుళం జిల్లాపై ఈ పార్టీలు దృష్టి సారించాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత శ్రీకాకుళం జిల్లా ఆ పార్టీకి కంచుకోటగా మారింది. అయితే గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పైచేయి సాధించింది. మరోసారి తామే పైచేయి సాధించాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుండగా, తమకు కంచుకోట ఎందుకైందో తెలియజేస్తూ పట్టును నిరూపించుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది.


ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం పాతపట్నం. 2019 లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరఫున పోటీచేసిన రెడ్డి శాంతి విజయం సాధించారు. టీడీపీ సీనియర్ నేత కలమట వెంకటమరణమూర్తి పై 15,551 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసి విజయం సాధించిన కలమట 2019 ఎన్నికల్లో పార్టీ మారి టీడీపీ టికెట్ తెచ్చుకొని ఓటమిపాలయ్యారు.

నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత 1952 నుంచి 1972 వరకు జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థులంతా ఘనవిజయం సాధించారు. 1978లో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 5 సార్లు విజయం సాధించింది.

తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తున్న తరుణంలో ఈసారి పాతపట్నం సీటు ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అలాగే వైసీపీ తరఫు నుంచి కూడా అభ్యర్థి ఖరారు కావాల్సి ఉంది.

ప్రస్తుతం తెలుగుదేశం 94 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా పాతపట్నం పేరు మాత్రం జాబితాలో లేదు. రెండో జాబితాలో ఉండే అవకాశం ఉండొచ్చంటున్నారు. ఏ పార్టీకా పార్టీ ఈ నియోజకవర్గాన్ని తమ కంచుకోటగా ప్రకటించుకుంటున్నాయి. అయితే ఈ కంచుకోటను బద్దలు కొట్టేదెవరో చూడాలి. వైసీపీ, టీడీపీ తరఫున కొత్త అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.