టి. నరసాపురం: స్థానిక విజన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు పాఠశాల కరస్పాండెంట్ పురం శ్రీనివాస్ ఆద్వర్యంలో బుధవారం నాడు నిర్వహించారు. ముందుగా తెలుగుతల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురం శ్రీనివాస్ మాట్లాడుతూ "మన మాతృభాష అయిన తెలుగులో విద్యాబోధన వలనే విద్యార్థులలో పరిపూర్ణ వికాసం పెరుగుతుందని అన్నారు. విద్యార్థులలో ఉన్నటువంటి సృజనాత్మక నైపుణ్యాలన్నీ సమగ్రంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. తెలుగు భాషను పరిపూర్ణంగా నేర్చుకోగలిగినప్పడు మాత్రమే ఇతర భాషలపై పట్టు సాధించగలమని అన్నారు. మాతృభాషలో విద్యార్జన చేసిన విద్యార్థులలో దేశభక్తి, సామాజిక చైతన్యం, మానవసేవ, నైతిక విలువలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. ప్రజలు తమ మాతృభాష అయిన తెలుగులోని మాధుర్యాన్ని గుర్తుంచుకొని, తెలుగు భాష సంస్కృతి, వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినిలు, మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.