ఏలూరు: బి.సి.,ల జాతి గౌరవాన్ని పెంచి, దేశ చరిత్రలో బి.సి లకు అన్ని రంగాలలో పెద్ద పీట వేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి డా. కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. స్థానిక 32 డివిజన్ లో 14 లక్షల రూపాయలతో నిర్మించిన యాదవ సంక్షేమ కమ్యూనిటీ హాలును ఆదివారం మంత్రి నాగేశ్వరరావు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, శాసనసభ్యులు ఆళ్ళ నాని, కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల సామజిక వర్గాలకు సామజిక, ఆర్ధిక, రాజకీయ రంగాలలో సమున్నత స్థానం కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. సంక్షేమం-అభివృద్ధికి సమాన ప్రాధాన్యతను ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి నడిపిస్తున్నారని, ప్రభుత్వం చేపట్టిన పథకాలతో రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుండి 6 శాతానికి తగ్గిందన్నారు. విద్యా, వైద్యంనకు ప్రాధాన్యత ఇచ్చి నాడు-నేడు కార్యక్రమం ద్వారా విద్యా, వైద్య రంగాలలో పలు సంస్కరణలు తీసుకువచ్చారని, విద్యలో దేశంలో ప్రధమ స్థానంలో ఉన్న కేరళ రాష్ట్రాన్ని దాటి మన రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనకు కృషి చేస్తున్నారని, ప్రజల వద్దకే పరిపాలన తీసుకువచ్చారన్నారు. దళారీల వ్యవస్థ లేకుండా రైతుల నుండి నేరుగా కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలుచేస్తున్నామన్నారు.
రాజ్యసభ సభ్యులు బీడా మస్తాన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయం చేస్తున్న ఆదర్శ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి అని, బిసి ల అభివృద్ధి ఎన్నో పధకాలు అమలు చేస్తున్నారన్నారు. యాదవ సంక్షేమ కమ్యూనిటీ హాలులో మొదటి అంతస్తు నిర్మాణానికి 15 లక్షల రూపాయలు, ఏలూరులో త్వరలో నిర్మించబోయే బిసి ల సమీకృత కమ్యూనిటీ హాలు నిర్మాణానికి 25 లక్షల రూపాయలు ఎంపీ నియోజక వర్గ అభివృద్ధి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఏలూరు శాసనసభ్యులు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) మాట్లాడుతూ రాష్ట్ర ముఖమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారికి అన్ని రంగాలలో ప్రాధాన్యత ఇస్తున్నారని, బిసి., ల సంక్షేమానికి వేలాది కోట్ల రూపాయలతో పధకాలు అమలు చేస్తూనే, రాజకీయంగా వారికి అన్ని పదవులలో 50 శాతం కు పైగా సీట్లు కేటాయిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు బిసి. లను ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేసి, వారి సంక్షేమాన్ని గాలికి ఒదిలేశాయన్నారు.
దెందులూరు శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ బి.సి ల సంక్షేమానికి కృషిచేస్తున్న నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అని, బి.సి లకు సామజిక, ఆర్ధిక, రాజకీయ రంగాలలో సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నెరుసు చిరంజీవి యాదవ సంక్షేమ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి లక్ష రూపాయలు, కైకలూరుకు చెందిన శ్రీనివాస్ యాదవ్ లక్షా ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు విరాళంగా అందించారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు నూకపెయ్యి సుధీర్ బాబు, గుడిదేసి శ్రీనివాసరావు, కో-ఆప్షన్ సభ్యులు ఎస్.ఎం.ఆర్. పెదబాబు, రాష్ట్ర సాహిత్య మండలి చైర్ పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, టిటిడి బోర్డు మెంబెర్ నెరుసు నాగసత్యం యాదవ్, కారుమూరి సునీల్ యాదవ్, పలువురు యాదవ సంఘ నాయకులు, ప్రభృతులు పాల్గొన్నారు.