టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిపే సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. కీలక సమాచారం సైబర్ మోసగాళ్ల చేతికి చిక్కుతుంది. సాంకేతిక అంశాల్లో అనుభవం ఉన్న వారైనా కొన్ని సార్లు మోసపోయి డబ్బులు పోగొట్టుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. మరోవైపు సర్వీస్ ప్రొవైడర్లు ఇస్తున్న ఆఫర్లకు ఆకర్షితులై ఒక్కొక్కరు నాలుగైదు సిమ్‌కార్డులు కూడా తీసుకుంటున్నారు. తీసుకున్నారు. కొంతకాలం వాడేసి పక్కన పడేస్తున్నారు. ఇదే సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇవ్వడం. అదే నంబర్‌తో కొత్త సిమ్‌కార్డుల్ని తీసుకొని యాక్టివేట్ చేస్కొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
కొద్దిరోజుల కిందట విజయవాడలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసే ఉంటుంది. అక్కడ ఒకే వ్యక్తి ఆధార్ కార్డుతో ఏకంగా 658 సిమ్ కార్డులు యాక్టివేట్ అయి ఉండటం గమనార్హం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) సాయంతో దీనిని గుర్తించిన టెలికాం అధికారులు.. వాటిని ఎలాగోలా బ్లాక్ చేశారు.
ఇలాంటి ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో టెలికాం శాఖ కొత్త నిబంధనలు రూపొందించింది. ఒక ఆధార్ కార్డుపై గరిష్టంగా 9 సిమ్ కార్డుల్ని మాత్రమే తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ సిమ్ కార్డులు తీసుకోవాల్సి వచ్చినప్పుడు రీ- వెరిఫికేషన్ చేసుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఈ అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. అంతా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలోనే ఒక ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకునేలా ఒక వెబ్‌సైట్ రూపొందించింది టెలికాం శాఖ. దీని ద్వారా ఆధార్ నంబర్‌తో ఎన్ని మొబైల్ నంబర్లు లింక్ అయి ఉన్నాయో చెప్పడం సహా.. మొబైల్‌ను ఎవరైనా దొంగిలించినా, పోగొట్టుకున్నా కూడా దానిని బ్లాక్ చేసుకునే అవకాశం కల్పించింది.
ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఇలా తెలుసుకోండి..
మొదట tafcop.dgtelecom.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి. దాంట్లో బ్లాక్ యువర్ లాస్ట్/స్టోలెన్ మొబైల్, Know Your Mobile Connection అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
రెండో ట్యాబ్‌పై క్లిక్ చేస్తే.. కస్టమర్ పదంకెల మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
తర్వాత మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే.. ఆ యూజర్ పేరు మీద ఉన్న మొబైల్ నంబర్స్ లిస్ట్ కనిపిస్తుంది.
దాంట్లో ఏదైనా నంబర్ మీదు కాకుంటే.. లేదా ఇప్పుడు వినియోగించకపోయినా.. దానిని బ్లాక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అక్కడే ఆప్షన్ కనిపిస్తుంది.
ఇలా చెక్ చేసుకోవాలి:
సంచార్ సాతి అధికారిక వెబ్‌సైట్ https://sancharsaathi.gov.in/ ఓపెన్ చేయాలి
అందులో రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మొబైల్ నెంబర్ కనెక్షన్ తెలుసుకోండి(TAFCOP) మీద క్లిక్ చేయాలి
కొత్త పేజీ ఓపెన్ అయిన తరువాత 10 అంకెల మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి
క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తరువాత.. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే.. యూజర్ మీద ఎన్ని మొబైల్ నంబర్స్ ఉన్నాయో కనిపిస్తుంది.
అక్కడే మనది కానీ నెంబర్ బ్లాక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.