ANDRAPRADESH, KRISHNA, THIRUVURU: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజకీయం వేడిపుట్టిస్తోంది. మున్సిపల్ చైర్‌పర్సన్ కస్తూరిబాయి రాజీనామాతో కొత్తవారిని ఎన్నుకునేందుకు కౌన్సిల్ సమావేశం కావాల్సివుంది. By: PASCHIMA VAHINI తిరువూరు నగర పంచాయతీ ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ జి.కస్తూరిబాయి రాజీనామాతో ఈ నెల 19న ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
అయితే 19 సోమవారం కోరం లేకపోవడంతో మంగళవారానికి ఎన్నికను వాయిదా వేశారు. ఈ రోజు కూడా కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తూ ఎన్నికల అధికారి, ఆర్డీవో మాధురి నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలను వివరిస్తూ ఈసీకి లేఖ రాస్తామని ఆమె తెలియజేశారు. ఇక తిరువూరులో అధికార పార్టీ అరాచకంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ వైసీపీ నేతలు ఈసీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాజకీయం వేడిపుట్టిస్తోంది. మున్సిపల్ చైర్‌పర్సన్ కస్తూరిబాయి రాజీనామాతో కొత్తవారిని ఎన్నుకునేందుకు కౌన్సిల్ సమావేశం కావాల్సివుంది. ఇంకా ఏడాది కూడా లేని చైర్మన్ పదవిని దక్కించుకోవాలని అధికార పార్టీ రంగంలోకి దిగడంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ నగర పంచాయతీలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతోపాటు 21 మందికి ఓటు హక్కు ఉంది. వీరిలో 11 మంది హాజరైతే ఎన్నిక నిర్వహణకు కోరం సరిపోతుంది. అయితే సోమవారం ఏడుగురు, మంగళవారం 8 మంది మాత్రమే హాజరయ్యారు.
తిరువూరు మున్సిపాలిటీలో వైసీపీకి మొత్తం 17 మంది కౌన్సిలర్లు ఉండగా, వీరిలో కొందరు టీడీపీతో చేతులు కలిపారని ప్రచారం ఉంది. ఎంతమంది టీడీపీకి మద్దతు చెప్పారనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం నలుగురు కౌన్సిలర్లు మాత్రమే టీడీపీకి బహిరంగ మద్దతు తెలియజేస్తున్నారు. టీడీపీ కౌన్సిలర్లు ముగ్గురు, కొత్తగా చేరిన నలుగురు, ఎమ్మెల్యే ఓటుతో కలిపి టీడీపీకి 8 ఓట్లు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే చైర్మన్ ఎన్నికకు మరో ముగ్గురు కౌనిలర్లు అవసరం ఉంది. దీంతో తమ కౌన్సిలర్లు చేజారిపోకుండా వైసీపీ నేతలు కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు.
తమ పార్టీకి మద్దతు తెలిపిన ఓ మహిళా కౌన్సిలర్ ను వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారని ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపిస్తుండగా, టీడీపీ అక్రమంగా గెలవాలని చూస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. తమ కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని కోరుతూ మంగళవారం ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించింది. తమ కౌన్సిలర్లు ఒక్కొక్కరికి ఒక్కో గన్ మన్ ను కేటాయించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కల్యాణి, పండుల రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీని కలిశారు.
11 గంటలకు ఎన్నిక నిర్వహించాల్సివుండగా, టీడీపీ నేతలు - పోలీసులు చేతులు కలిపి వైసీపీ కౌన్సిలర్లను పార్టీ నేతలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పోలీసులు కూడా టీడీపీ కార్యకర్తలు మాదిరిగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దౌర్జన్యంతో చైర్మన్ పదవిని దక్కించుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. కాగా, తిరువూరులో ఎన్నిక నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కోరారు. బిహార్ పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.