తాజా వార్తలు

10/recent/ticker-posts

ఆమని చెరువు ఆయకట్టు రైతుల సమస్యలపై కలెక్టర్ పరిశీలన


ఏలూరు/అగిరిపల్లి, సెప్టెంబరు 26: అగిరిపల్లి మండలం సగ్గూరులో ఆమని చెరువు ఆయకట్టు రైతుల సమస్యలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి శనివారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయకట్టు పరిధిలోని రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


ఆమని చెరువు నీటిని తమ ప్రాంతంలోని పొలాలకు సాగునీరు అందించేందుకు ఇతర ప్రాంతాల ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని సగ్గూరుకు చెందిన పలువురు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. తమకు సాగునీరు అందేలా సమస్యను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

రైతులు వివరించిన సమస్యలను కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయకట్టు రైతులకు సాగునీటి విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకుని, సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు.

రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. రైతులకు సాగునీరు అందే అంశంలో అధికారులతో సమన్వయం చేసుకుని తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, కృష్ణాజిల్లా ఇరిగేషన్ ఎస్ఈ గునకరరావు, ఈఈ కె. బాబు, మత్స్యశాఖ సహాయ సంచాలకులు బి. రాజ్ కుమార్, తహశీల్దార్ పి.ఎన్.వి. ప్రసాదు, ఇన్‌చార్జి ఎంపీడీవో అబ్దుల్ సలామ్, ఇరిగేషన్ ఏఈ జి. వెంకటేష్‌తో పాటు రెవెన్యూ, వ్యవసాయ, ఇరిగేషన్, పోలీసు శాఖల అధికారులు, స్థానిక రైతు నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.