మలేరియా నియంత్రణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు: కమిషనర్
కేసులు పెరిగిన తర్వాత కాదు.. ముందే గుర్తించి అడ్డుకోవాలి
ఒక్క మలేరియా మరణం కూడా జరగకూడదు
విజయవాడ, సెప్టెంబర్ 29:
రాష్ట్రంలో మలేరియా కేసుల నియంత్రణలో నిర్లక్ష్యం, అలసత్వం, జాప్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.వి.ఎన్. చక్రధరబాబు అధికారులను హెచ్చరించారు. కేసులు పెరిగిన తర్వాత స్పందించడం కాదని, ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడమే అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు.
విజయవాడలో మంగళవారం 28 జిల్లాల అధికారులతో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలలో మలేరియా పరిస్థితి, వ్యాధుల నిఘా, దోమల నియంత్రణ, మందుల లభ్యత, సిబ్బంది పనితీరుపై కమిషనర్ సమీక్షించారు. ముందస్తు నిఘా, సత్వర పరీక్షలు, సకాలంలో చికిత్స, దోమల నియంత్రణ, మందుల పూర్తి లభ్యత అనే ఐదు అంశాల్లో ఎక్కడా లోపం ఉండకూడదని ఆదేశించారు.
ముందస్తు నిఘాపై ప్రత్యేక దృష్టి
మలేరియా కేసులు పెరిగిన తర్వాత చర్యలు ప్రారంభించడం జాప్యానికి దారితీస్తుందని చక్రధరబాబు అన్నారు. వ్యాధి వ్యాప్తికి సంబంధించిన తొలి సంకేతాలు కనిపించిన వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా గిరిజన, మారుమూల, అధిక ప్రమాద ప్రాంతాల్లో జ్వర కేసులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
జ్వరం వచ్చిన ప్రతి వ్యక్తికి అవసరమైన పరీక్షలు నిర్వహించి, మలేరియా నిర్ధారణ అయితే వెంటనే చికిత్స అందించాలని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో కేసుల గుర్తింపులో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమాచారం అందిన వెంటనే చర్యలు
ఐహెచ్‌ఐపీ–ఐడీఎస్‌పీ ద్వారా అందుతున్న సమాచారాన్ని నిరంతరం విశ్లేషించి, మలేరియా వ్యాప్తికి అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని కమిషనర్ ఆదేశించారు. ఏవేర్, ఏడీఎస్ వ్యవస్థలను పూర్తిస్థాయిలో వినియోగించి ముందస్తు నిఘాను బలోపేతం చేయాలని సూచించారు.
మలేరియా కేసులు నమోదైన ప్రాంతాల్లో దోమల నియంత్రణ చర్యలను వెంటనే చేపట్టాలని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో ఏఎల్‌ఓ, ఐఆర్‌ఎస్, ఐఎస్‌ఎస్, పొగ పిచికారీ వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కేసులు పెరిగిన తర్వాత కాకుండా, పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందే గుర్తించి నియంత్రణ చర్యలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
మందుల నిల్వలు ముందుగానే సిద్ధం చేయాలి
జిల్లాల్లో మలేరియా పరిస్థితిని బట్టి మందుల అవసరాన్ని ముందుగానే అంచనా వేసి తగినంత నిల్వలు అందుబాటులో ఉంచాలని చక్రధరబాబు ఆదేశించారు. కేసు నమోదైన తర్వాత మందుల కోసం వెతికే పరిస్థితి ఉండకూడదన్నారు. మలేరియా నివారణ మందుల లభ్యత, నిల్వలపై సమావేశంలో ప్రత్యేకంగా సమీక్షించారు.
కేటాయించిన నిధులను నిర్దిష్ట సమయంలోగా వినియోగించాలని అధికారులకు సూచించారు. ముందస్తు ప్రణాళిక సక్రమంగా లేకపోవడం వల్ల నిధుల వినియోగంలో వెనుకబడుతున్న పరిస్థితిని నివారించాలని అన్నారు.
క్షేత్రస్థాయి పనితీరుపై పర్యవేక్షణ
మలేరియా నియంత్రణలో పనిచేస్తున్న సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని, వారి క్షేత్రస్థాయి పనితీరును అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. కాగితాలపై నివేదికలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించాలని స్పష్టం చేశారు.
మలేరియాతో పాటు కాలాజార్, ఫైలేరియా వ్యాధుల వివరాలను కూడా పక్కాగా నమోదు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. సమాచారం, నివేదికల విషయంలో ఎలాంటి జాప్యం చేయవద్దని, నిర్లక్ష్యం బయటపడితే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఒక్క మలేరియా మరణం కూడా జరగకూడదని, ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని కె.వి.ఎన్. చక్రధరబాబు స్పష్టం చేశారు.
సమావేశంలో ప్రజారోగ్య శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ వెంకటరమణ, జాయింట్ డైరెక్టర్ అర్జునరావు, డిప్యూటీ డైరెక్టర్ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.



