తాజా వార్తలు

10/recent/ticker-posts

“ఓటీపీ చెప్పారంటే మోసపోయినట్టే.. విద్యార్థులకు పోలీసుల కీలక హెచ్చరిక!”


విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన


ఏలూరు, సెప్టెంబర్ 29:
జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాలు, దిశానిర్దేశాల మేరకు ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బారావు ఆధ్వర్యంలో శక్తి టీమ్ సభ్యులు ఏలూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సైబర్ ముప్పులు, ఆన్‌లైన్ మోసాలు, గేమింగ్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా వేధింపులపై పోలీసు సిబ్బంది అవగాహన కల్పించారు. వ్యక్తిగత వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు ఇతరులతో పంచుకోకూడదని సూచించారు. సైబర్ నేరానికి గురైతే భయపడకుండా వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల తక్షణ సహాయం కోసం 112 నంబర్‌ను సంప్రదించవచ్చని విద్యార్థులకు వివరించారు. అలాగే పిల్లలు లేదా విద్యార్థులు మానసిక, శారీరక వేధింపులకు గురైనప్పుడు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 ద్వారా సహాయం, రక్షణ పొందవచ్చని తెలిపారు.

మహిళలు, బాలికల రక్షణ కోసం ఏలూరు జిల్లా పోలీసు శాఖ నిర్వహిస్తున్న శక్తి టీమ్స్ విధులు, సేవల గురించి కూడా వివరించారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, వేధింపులు ఎదురైనా భయపడకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సైబర్ భద్రత, అత్యవసర సహాయ నంబర్లపై అవగాహన పొందారు. చదువుతో పాటు చట్టాలు, భద్రతా సేవలపై కూడా విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని పోలీసులు సూచించారు. కార్యక్రమంలో నారాయణ పాఠశాల హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.