డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, ప్రతినిధి: ఆహార భద్రత చట్టం వివిధ విభాగాలలో సమర్థవంతమైన అమలు కోసం కృషి చేస్తూ జిల్లాను ఆహార భద్రత విషయంలో అధికారులు సమన్వయంతో ముందంజలో నిలపాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణ కిరణ్ అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లాస్థాయి అధికారులతో పర్యటన ఏర్పాట్లు గురించి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక అధికారులందరూ సుపరిచితమైనని గత రెండు నెలలలో వివిధ విభాగాలలో నిర్వహించిన ప్రక్రియను సాధారణ తనిఖీలో భాగంగా ఈనెల 9, 10 తేదీలలో రెండు రోజులపాటు పర్యటించడం జరుగుతుందని, వివిధ అంశాలలో గుర్తించిన లోటుపాట్లను సుహృద్భావ వాతావరణంలో సరిదిద్దాలని ఆయన కోరారు. గృహ ఆహార భద్రత సమస్యను ప్రభుత్వం చాలా కాలంగా ప్రజా పంపిణీ వ్యవస్థల ద్వారా నిరంతరం పరిష్కరిస్తున్నప్పటికీ, 20 13 జూలై 5న జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అమలులోకి రావడంతో ఆహార భద్రతపట్ల సంక్షేమం నుండి హక్కుల ఆధారిత విధానం వైపు ఒక నమూనా మార్పు వచ్చిందని ఈ చట్టం చట్టబద్ధంగా ప్రజాపంపిణీ వ్యవస్థ కింద సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను పొందే హక్కును కలిగి ఉందన్నారు. అందువల్ల జనాభాలో మూడింట రెండు వంతుల మంది అధిక సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను పొందేందుకు ఈ చట్టం పరిధిలోకి వస్తారన్నారు.
జాతీయ ఆహార భద్రత చట్టం 2013 ప్రకారం నిరుపేదలకు ఆహార భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడి కేంద్రాలలో ఉన్న నిరుపేద పిల్లలు అందరికీ నాణ్యమైన భోజనం అందించాలన్నా రు. ప్రతి ఒక్కరు బాగా చదవాలని చదువు విజ్ఞానాన్ని అందిస్తుందని ఆయన సూచించారు. ముఖ్యంగా బాల్య వివాహాలను అరికట్టాలని అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆకలితో మరణించకూడదని ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గర్భవతుల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్క నిరుపేదలకు రేషన్ షాపుల ద్వారా ఉచిత రేషన్ బియ్యాన్ని అంది స్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా పేద విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాన్ని అందించడం జరుగుతుందన్నారు.
సాధారణ తనిఖీల్లో భాగంగా గుర్తించిన లోటుపాట్లను అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిష్కరించి వివిధ పథకాల ఆశయ సాధనదిశగా పాటుపడాలన్నారు. నిరుపేదలు ఎవరు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అమ్ముకోవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కిలో 45 రూపాయలు చెల్లించి రైతుల వద్ద బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారని, అంతేకాకుండా అందులో పోషకాల కోసం మరికొన్ని పదార్థాలను బియ్యానికి జోడించి లబ్దిదారులకు ఒక్క రూపాయికే అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అయితే చాలామంది లబ్దిదారులు రూపాయికే కిలో బియ్యాన్ని అందించడంతో అది ఏదో చౌక బియ్యమని దళారులకు అమ్ము కుంటున్నారని అయితే ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యంలో ఎన్నో పోషకాలు ఉన్నాయని వాటిని గంజి వంచకుండా ఉడికించుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని శరీరానికి కావాల్సిన విటమిన్స్ లభిస్తాయని ఆయన తెలిపారు.
జిల్లా జాయిం ట్ కలెక్టర్ టి నిషాoతి మాట్లాడుతూ చట్టం యొక్క మార్గదర్శక సూత్రాలలో గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, 6 నెలల నుండి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలకు ప్రత్యేక నిబంధనలు చేయబడ్డాయన్నారు, ఐసిడిఎస్ పథకం కింద అంగన్వాడీ కేంద్రాల ద్వారా సమగ్రశిశు అభివృద్ధి పథకాలు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడిభోజన కింద పాఠశాలల ద్వారా ఉచితంగా పోషకాహార భోజనం పొందే హక్కు వారికి కల్పించబడిందన్నారు.
6 సంవత్సరాల వరకు పోషకాహార లోపం ఉన్న పిల్లలకు అధిక పోషకాహార ప్రమాణాలు సూచించబడతాయన్నారు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు గర్భధారణ సమయంలో వేతన నష్టాన్ని పాక్షికంగా భర్తీ చేయడానికి మరియు పోషకాహారాన్ని భర్తీ చేయడానికి మాతృత్వ వందన యోజన ద్వారా మొదటి కాన్పుకు రూ 5 వేలు రెండో కాన్పులో ఆడపిల్ల అయితే రూ 6,000 ఒకే విడతలో నగదు ప్రసూతి ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులన్నారు.
ఈ రెండు రోజుల గౌరవ ఆహార భద్రత కమిషన్ సభ్యుల పర్యటనలో సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ జిల్లా స్థాయి అధికారులు పాల్గొని సభ్యులు గుర్తించిన లోటుపాట్లను సరిదిద్దాలని ఆమె ఆదేశించారు ఆహార భద్రత విషయంలో పర్యవేక్షణతో పాటుగా సభ్యుల సిఫార్సులను ఆచరిస్తూ లబ్ధిదారుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎస్ఓ ఉదయభాస్కర్, ఏ ఎస్ ఓ శరత్, డిఎం సివిల్ సప్లై కుమారి బాల సరస్వతి, డి ఎం అండ్ హెచ్ ఓ దుర్గారావు దొర, తూనికలు కొలతలు శాఖ కంట్రోలర్ రాజేష్, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిని పి జ్యోతిలక్ష్మి దేవి, ఐసిడిఎస్ పిడి శాంత కుమారి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రమేష్ పాల్గొన్నారు