ఏలూరు/బుట్టాయిగూడెం, జూన్ 12: బుట్టాయిగూడెం మండలంలోని రామన్నగూడెం, సీతప్పగూడెం, ధాసయ్యపాలెం, కండ్రికగూడెం, ముప్పినవారిగూడెం గ్రామాల్లో శుక్రవారం రైతులకు పీఎండీఎస్ (PMDS) నవధాన్యాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్ ఆదేశాల మేరకు డివిజనల్ ఇన్‌చార్జి ఎన్ఎఫ్ఏ డి. మధుబాబు రైతులకు నవధాన్యాల సాగు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ, నవధాన్యాల పంటలు పురుగులు, తెగుళ్ల ప్రభావాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అంతేకాకుండా నేలలో సూక్ష్మజీవుల కార్యకలాపాలు, వానపాముల సంఖ్య పెరిగి జీవవైవిధ్యం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. దీని వల్ల నేల సారవంతం కావడంతో పాటు ప్రకృతి వ్యవసాయానికి బలమైన పునాది ఏర్పడుతుందని పేర్కొన్నారు.
నవధాన్యాల సాగు వల్ల పంటల వేర్ల వ్యవస్థ బలపడటంతో వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని వివరించారు. తద్వారా దిగుబడులు, పంటల నాణ్యత, పోషక విలువలు మెరుగుపడి రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని తెలిపారు. ప్రకృతి ఆధారిత వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయ వ్యయాలు కూడా తగ్గుతాయని చెప్పారు.
అలాగే నవధాన్యాల పంటలు పశువులకు పోషక విలువలతో కూడిన నాణ్యమైన పచ్చిమేతగా ఉపయోగపడతాయని, దీంతో పాల ఉత్పత్తి మరియు పాల నాణ్యత మెరుగుపడుతుందని రైతులకు వివరించారు. పంటల వైవిధ్యం రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో దోహదపడుతుందని సూచించారు.
అనంతరం ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ ఎన్. శ్రీను ఆధ్వర్యంలో రైతులు యు. సత్తిబాబు, ఎన్. సత్యనారాయణ, ఎం. రత్నగిరివాసు, యు. వెంకటరాంబాబు, సి.హెచ్. సత్యనారాయణ, కె. నాగేశ్వరరావు, డి. శ్రీను, ఎం. చైతన్య, పి. చంద్రరావు, సోమమ్మ తదితరులకు మొత్తం 85 పీఎండీఎస్ విత్తన కిట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది, రైతులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


