తాజా వార్తలు

10/recent/ticker-posts

ఇంజనీరింగ్ నిర్మాణ పనులు నాణ్యతతో, గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్ కె. వెట్రిసెల్వి


ఏలూరు, జూన్ 12: జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపడుతున్న నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇంజనీరింగ్ శాఖల పనుల పురోగతి, బిల్లుల అప్‌లోడ్ స్థితిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా పురోగతిని పరిశీలించిన కలెక్టర్, వెనుకబడిన అధికారులకు పలు సూచనలు చేశారు.


సమీక్ష సందర్భంగా ఐసీడీఎస్, నీటిపారుదల శాఖలకు చెందిన అధికారులు సరైన సమాచారంతో సమావేశానికి హాజరుకాకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో పురోగతి చూపించని, బిల్లుల అప్‌లోడ్‌లో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ (ఆర్‌డబ్ల్యూఎస్)కు అప్పగించిన అంగన్‌వాడీ కేంద్రాల మరుగుదొడ్ల నిర్మాణాలను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సురక్షిత తాగునీటి కోసం ఆర్‌వో ప్లాంట్లు, తగిన సంఖ్యలో మరుగుదొడ్లు, నీటి సరఫరా సౌకర్యాలు ఉండేలా చూడాలని సూచించారు.

జిల్లాలోని ప్రాథమిక, అంగన్‌వాడీ, ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్ల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి, తాగునీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాల భవనాల పరిస్థితిని పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, శిథిలావస్థకు చేరిన భవనాలను ముందుగానే గుర్తించి నివేదికలు సమర్పించాలని సూచించారు. బాలికల వసతి గృహాల వద్ద భద్రతను మరింత పటిష్టం చేసేందుకు దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఆర్ అండ్ బి శాఖ ఎస్‌ఈ కె. విజయరత్నం, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ సి.హెచ్. దేవప్రకాశ్, గృహనిర్మాణ శాఖ పీడీ జి. సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ, సమగ్ర శిక్షా అభియాన్ అధికారి పంకజ్ కుమార్, ఐసీడీఎస్ పీడీ పి. శారద, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వై. విశ్వమోహన్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, డీఈలు తదితరులు పాల్గొన్నారు.