ఏలూరు, జూన్ 12: ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి అధ్యక్షతన, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శాఖ మరియు క్రాఫ్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఈ సందర్భంగా ఎన్. శ్రీలక్ష్మి మాట్లాడుతూ, బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడం, బాల కార్మికులను గుర్తించి వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించవచ్చని పేర్కొన్నారు.
బాల కార్మిక వ్యవస్థ పిల్లల బాల్యాన్ని, సామర్థ్యాన్ని, గౌరవాన్ని హరించడమే కాకుండా వారి శారీరక, మానసిక వికాసంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆమె వివరించారు. బాల కార్మిక వ్యవస్థ వల్ల కలిగే నష్టాలపై ప్రజలు, పరిశ్రమలు, సంస్థల యాజమాన్యాల్లో అవగాహన పెంపొందించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సామాజిక సమస్యను నిర్మూలించడంలో అధికారులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ పి. శ్రీనివాస్ మాట్లాడుతూ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థతో పాటు పలు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. జిల్లాలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపడుతూ బాల కార్మికులను గుర్తించి వారికి విద్యా అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డీసీపీవో సి.హెచ్. సూర్యచక్రవేణి, సీడబ్ల్యూసీ ఇన్‌చార్జి చైర్‌పర్సన్ పి. వెంకటేశ్వరరావు, ఏఎల్‌ఎస్ కోఆర్డినేటర్ ఎస్. నాగేశ్వరరావు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ నాగేశ్వరరావు, సీడీపీవో తులసి, అబ్జర్వేషన్ హోమ్ సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.


