తాజా వార్తలు

10/recent/ticker-posts

ఇండ్లగణనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్ వెట్రిసెల్వి


ఏలూరు, పశ్చిమ వాహిని, మే 11: జిల్లాలో ఇండ్లగణన కార్యక్రమాన్ని నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయని అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. సోమవారం జిల్లా స్థాయిలో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఇండ్లగణన ప్రగతిని సమీక్షించిన కలెక్టర్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ జనగణన కార్యక్రమంలో భాగంగా మే 1 నుంచి 30వ తేదీ లోగా ఇండ్లగణన పూర్తి చేయాల్సి ఉందన్నారు. అయితే 10 రోజులు గడిచినా అనుకున్న స్థాయిలో ప్రగతి కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. జనగణన కార్యక్రమం అత్యంత కీలకమైనదని, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన రోజువారీ లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు రోజులలోగా ప్రగతిలో మార్పు చూపించని సిబ్బంది చర్యలకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. కొన్ని మండలాల్లో ఒకే ఎన్యూమరేటర్‌కు అదనంగా మరిన్ని గ్రామాలు కేటాయించడం వల్ల లక్ష్యాలు పూర్తి కావడం లేదని గుర్తించిన కలెక్టర్, అదనపు గ్రామాల బాధ్యతలను ఇతరులకు బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు.

తహసీల్దార్లు, డివిజన్ స్థాయి అధికారులు ప్రతిరోజూ తమ పరిధిలోని ఎన్యూమరేటర్ల పనితీరును సమీక్షించాలని సూచించారు. లక్ష్యాల్లో వెనుకబడిన సిబ్బందిని గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుని గణన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీవోలు కిషోర్, రమణ, మండల తహసీల్దార్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.