Hot Posts

6/recent/ticker-posts

జూనియర్ న్యాయవాదుల సమస్యలపై పోరాటాలు చేయాలని సంఘం సమావేశం


తాడేపల్లిగూడెం: ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం  శనివారం పి.పి. లక్ష్మి అధ్యక్షతన తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ హాలులో జరిగింది. ఈ సమావేశంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు దిగుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో 60 వేల మంది న్యాయవాదులు ఉన్నారని, వారు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 


కూటమి ప్రభుత్వము ఎన్నికల ముందు న్యాయవాదులకు మ్యాచింగ్ గ్రాంట్ ను మృతి చెందిన న్యాయవాది ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసిందని అన్నారు . రాష్ట్రంలో 1,275 మంది న్యాయవాదులు మృతి చెంది ఉంటే 103 మందికి మాత్రమే ఇచ్చిందని ఆయన మిగిలిన వారికి ఇవ్వకపోవడం వల్ల మృతి చెందిన కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారని అన్నారు. న్యాయవాదులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయి. న్యాయవాదులకు ఎటువంటి రక్షణ లేదని అందుకు రాష్ట్ర ప్రభుత్వము న్యాయవాదుల రక్షణకు చట్టం చేయాలని డిమాండ్ చేశారు. 

న్యాయవాది వృత్తి పట్ల నేడు ఎక్కువమంది ఆకర్షితులై న్యాయవాది విద్యను అభ్యసిస్తున్నారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6,300 మంది కొత్త న్యాయవాదులు పేర్లు ను నమోదు చేసుకుని ఉన్నారని అటువంటి న్యాయవాదులకు స్టైఫెండ్ ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు లానేస్తము రూ.5000 గత 15 నెలల నుండి ఇవ్వడం లేదని వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. 

కొంతమంది న్యాయవాదులు అనారోగ్యాలకు గురవుతున్నారని వాళ్లకు ప్రభుత్వం మెడికల్ ఇన్సూరెన్స్ 15 లక్షలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారంకు పోరాటాలకు  సిద్ధo కావాలని,  ఐలు ఆధ్వర్యంలో  న్యాయవాదులను చైతన్యవంతులను చేయాలని అన్నారు. న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళుటకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెమోరాండాలు సమర్పించాలని, కోర్టు పరిధిలో ఉన్న సమస్యలను న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లాలని, జూనియర్ న్యాయవాదుల సమస్యలపై పోరాటాలు చేయాలని సంఘం సమావేశం పలు తీర్మానాలు చేసింది. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు కౌరు వెంకటేశ్వర్లు, కామన మునిస్వామి, గెద్ద విజయభాస్కర్, యడవల్లి మణికంఠ  తేజ, డి రాజారావు తదితరులు మాట్లాడినారు.