తాజా వార్తలు

10/recent/ticker-posts

ప్రేమాలయం వృద్ధాశ్రమంలో ఘనంగా మదర్స్ డే వేడుకలు


ఏలూరు, పశ్చిమ వాహిని, మే 10: మానవతా సంస్థ మరియు ప్రేమాలయం వృద్ధాశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో మదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రేమాలయం వృద్ధాశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షులు మునగాల మురళీకృష్ణ అధ్యక్షత వహించారు.


ఈ సందర్భంగా డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు మాట్లాడుతూ “అమ్మను మించిన దైవం లేదని” అన్నారు. అమ్మ ఒడే తొలి బడి, తొలి భాష, తొలి నడకకు పునాది అని పేర్కొన్నారు. నవమాసాలు మోసి పెంచి జీవితాంతం నిస్వార్థ ప్రేమను పంచేది తల్లేనని కొనియాడారు. మనిషి ఎంత ఎదిగినా తన విజయానికి మూలం తల్లేనని, అమ్మ ప్రేమకు విలువ కట్టలేమన్నారు.

తల్లులు జీవితాంతం పిల్లల మేలు కోరుకుంటూ ఆశీర్వదిస్తారని, అలాంటి తల్లులను నిర్లక్ష్యం చేయకుండా వారి రుణాన్ని తీర్చుకోవాలని సూచించారు. తల్లిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

మునగాల మురళీకృష్ణ మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో ఉన్న మాతృమూర్తులకు ప్రేమాలయం కుటుంబ సభ్యుల్లా అండగా నిలుస్తోందన్నారు. బిడ్డలు దూరంగా ఉన్న తల్లులకు ఇక్కడ ప్రేమ, ఆప్యాయత, వైద్య సేవలు, భోజన సదుపాయాలు అందిస్తూ మరిన్ని సేవలు కొనసాగిస్తున్నామని తెలిపారు.

అనంతరం వృద్ధాశ్రమంలోని మాతృమూర్తులను శాలువాలతో సత్కరించి పండ్లు, తినుబండారాలు అందజేశారు. కార్యక్రమంలో పోడూరు కనకదుర్గ, సత్యవాణి, రంగనాయకి, సాయి కుమారి, ద్రోణాదుల శ్రీనివాస్, సాంబశివరావు, పల్లకవి శ్రీనివాసరావు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.