Hot Posts

6/recent/ticker-posts

రెడ్ బుక్ వర్కు చేస్తుంటే.. తప్పు చేసిన వారికి చట్టప్రకారం శిక్షలు పడ్డాయా..? ప్రక్రియ ఇప్పటికి ఎక్కడ?


ANDRAPRADESH, RED BOOK NEWS: విపక్షంలో ఉన్న వేళ.. ప్రతి సందర్భంలోనూ రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చిన లోకేశ్.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే మాటను తరచూ చెప్పటం కనిపిస్తోంది. ఏమైనా ‘రెడ్ బుక్’ అనే పదానికి కొత్త క్రేజ్ తీసుకురావటమే కాదు.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొత్త రంగు పుస్తకాలకు పొలిటికల్ క్రేజ్ తీసుకొచ్చిన క్రెడిట్ ఏపీ రాష్ట్ర మంత్రి లోకేశ్ కే దక్కుతుంది. విపక్షంలో ఉన్న వేళ.. అప్పటి జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి.. డస్సిపోయిన టీడీపీ నేతలు.. భయాందోళనలో ఉన్న క్యాడర్ కు కొత్త ఉత్సాహాన్ని కలిగించేలా రెడ్ బుక్ కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చిన ఆయన.. తన మాటలతో కొత్త ఉత్సాహాన్ని తెచ్చే ప్రయత్నం చేశారు. 

విపక్షంలో ఉన్న వేళ.. ప్రతి సందర్భంలోనూ రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చిన లోకేశ్.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే మాటను తరచూ చెప్పటం కనిపిస్తోంది. కొద్దిరోజులుగా రెడ్ బుక్ అంశం ఏపీ రాజకీయాల్లో పెద్దగా వినిపించని పరిస్థితి. ఇలాంటివేళ.. తాజాగా వైఎస్సార్ కడప జిల్లా బుగ్గలేటిపల్లి వద్ద నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చారు. తాను ఏదీ మర్చిపోలేదని.. రెడ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందని వ్యాఖ్యానించటం గమనార్హం. 

లోకేశ్ చెప్పినట్లుగా రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుంటే.. ఇప్పటికే విపక్షం ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండాలి. అందుకు భిన్నంగా మంత్రి లోకేశే.. రెడ్ బుక్ అమల్లో ఉందని.. యాక్టివ్ గా ఉందన్న విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఏమిటి?అన్నది ప్రశ్న. నందం సుబ్బయ్య.. తోట చంద్రయ్యను చంపింది మర్చిపోతానా? చంద్రబాబును 53 రోజులు అక్రమంగా జైల్లో బంధిస్తే కొడుకుగా మర్చిపోతానా? అని ప్రశ్నించిన ఆయన.. తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని.. రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందని పేర్కొన్నారు. 

ఒకవేళ లోకేశ్ మాటలే నిజమని అనుకుందాం. మరి.. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ఇప్పటివరకు తప్పులు చేసిన వారిలో ఎవరికి శిక్షలు పడ్డాయి? ఎంతమందికి తగినశాస్తి జరిగింది? అన్నది ప్రశ్న. డాక్టర్ సుధాకర్ ను మానసిక రోగిగా ముద్ర వేసిన వైనంలో నిజం ఏమిటో తెలుగు ప్రజలకు కూటమి సర్కారు ఎందుకు చెప్పలేకపోయింది. అది కూడా వదిలేద్దాం. వైఎస్ వివేకానంద హత్య విచారణ.. దానికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఎందుకు ఉంది? 

చేయని తప్పునకు చంద్రబాబును అన్యాయంగా జైల్లో వేశారని చెప్పే లోకేశ్ అండ్ కో.. అన్యాయంగా వైఎస్ వివేకాను హత్య చేసిన వారి లెక్కను ఎందుకు బయటపెట్టలేకపోతున్నట్లు? అందుకు బాధ్యులైన వారిపై చర్యలు ఏమిటి? ఇదంతా కాసేపు పక్కన పెడదాం. అసలు రెడ్ బుక్ యాక్టివ్ గా ఉన్నా.. వర్కింగ్ కండీషన్ లో ఉన్నా.. అది పని చేస్తున్న విషయాన్ని లోకేశ్ వివరణ రూపంలో చెప్పుకోవాల్సిన అవసరమే ఉండదు కదా? 2019-24 మధ్య తప్పుడు కేసులు ఎదుర్కొన్న కార్యకర్తలకు విముక్తి కల్పిస్తామని.. నాయకుల సమస్యల్ని పరిష్కరిస్తామని చెబుతున్న లోకేశ్.. ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరకు ఇప్పటివరకు ఏ అంశంలోనూ ఒక కచ్ఛితమైన అడుగు పడని వేళ.. ఈ ఊరింపు మాటలు వర్కువుట్ అయ్యే అవకాశం ఉందా? అన్నది ప్రశ్నగా మారింది.