తాజా వార్తలు

10/recent/ticker-posts

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: ఈగల్ టీమ్ అవగాహన


ఏలూరు, పశ్చిమ వాహిని, మే 6: “యువతే దేశ భవిష్యత్” అనే సందేశంతో ఏలూరు నగరంలోని సీఆర్ రెడ్డి కాలేజీలో నిర్వహించిన 19వ ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో మాదక ద్రవ్యాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.


ఈ సందర్భంగా ఈగల్ డిపార్ట్మెంట్ ఆర్‌ఎస్‌ఐ బి. ఉదయభాస్కర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక మరియు సామాజిక దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాలకు చెందిన సుమారు 650 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో కూడిన జీవితం గడపాలని ఆయన సూచించారు.

కార్యక్రమంలో విద్యార్థులతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించి, మాదకద్రవ్యాలపై వారికి ఉన్న సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. మాదకద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, సమాజంలో ఇతరులను కూడా చైతన్యపరిచే బాధ్యత యువతపై ఉందని వివరించారు.

ఎన్‌సీసీ క్యాడెట్లు సమాజంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో భాగస్వాములు కావాలని ఈగల్ టీమ్ పిలుపునిచ్చింది. యువతలో అవగాహన పెంపొందించడం ద్వారా మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టవచ్చని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారులు, విద్యార్థులు మరియు ఈగల్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.