హైకోర్టు న్యాయమూర్తులకు ఎస్పీ ఘన స్వాగతం
ఏలూరు, పశ్చిమ వాహిని, మే 6: కైకలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు మేజిస్ట్రేట్ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు శ్రీమతి జస్టిస్ కిరణ్మయి మాధవ్, జస్టిస్ సి.హెచ్. మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ వి. గోపాల కృష్ణారావు, జస్టిస్ బట్టు దేవానంద ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కార్యక్రమానికి విచ్చేసిన న్యాయమూర్తులను ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆత్మీయంగా స్వాగతించారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ కొత్త కోర్టు ఏర్పాటు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పాల్గొని నూతన కోర్టు ప్రారంభం ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ అవుతాయని పేర్కొన్నారు. కేసుల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు ప్రజలకు సమయపాలన, వ్యయభారం తగ్గే అవకాశం ఉందన్నారు.
కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, కైకలూరు టౌన్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, రూరల్ ఇన్‌స్పెక్టర్ వి. రవికుమార్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. నూతన కోర్టు ఏర్పాటుతో కైకలూరు పరిసర ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.


