టీ.నర్సాపురం, పశ్చిమ వాహిని, మే 7: మన్యం వీరుడు Alluri Sitarama Raju 102వ వర్ధంతి సందర్భంగా టీ.నర్సాపురం మండల కేంద్రంలో సామాజిక కార్యకర్తలు, డ్రైవర్లు సంయుక్త ఆధ్వర్యంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
సుమారు 38 సంవత్సరాల క్రితం అల్లూరి సీతారామరాజు ట్రాక్టర్ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో, దివంగత ఎంపీ నటశేఖర కృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించబడిన విగ్రహానికి టీ.నర్సాపురం సీనియర్ డ్రైవర్ జోనుబోయిన కోటేశ్వరరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ఎస్.డి. నాసర్ పాషా మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు కేవలం 27 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి గిరిజనుల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్‌కు వ్యతిరేకంగా, వెట్టిచాకిరి నిర్మూలన కోసం 1922 నుంచి 1924 మధ్య జరిగిన రంప విప్లవం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.
నేటి యువత అల్లూరి జీవితంలో నుంచి ధైర్యం, త్యాగం, సంఘటితం అనే మూడు గొప్ప విలువలను నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అల్లూరి స్ఫూర్తితో టీ.నర్సాపురం మండల సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటై కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు, డ్రైవర్లు పింగుల మధు, కొరివి నాగేశ్వరరావు, నారపాం దుర్గారావు, బూసి జయరాజు, బత్తుల నాగేశ్వరరావు, మారుమూళ్ల రామస్వామి, చిన్నం జాన్, కొక్కిరిగడ్డ కాంతయ్య, స్థానిక యువకులు కొక్కిరిగడ్డ సుందరం, శీలం ఇమ్మానియేల్, శీలం సులేమాన్, ధూబా లాజర్, ఎం. వెంకటేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అల్లూరి సీతారామరాజుకు జోహార్లు అర్పించారు.


