ఏలూరు, పశ్చిమ వాహిని, మే 9: శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామి ఆలయం లో శనివారం ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరియు ఆయన సతీమణి రాధారాణి ఆధ్వర్యంలో ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో దశాబ్దాల చరిత్ర కలిగిన పురాతన ఆలయాన్ని పునర్నిర్మించి పునఃప్రతిష్ట నిర్వహించారు. స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి సందర్భంగా శ్రవణా నక్షత్ర యుక్త కర్కాటక లగ్నంలో విమాన గోపురం, ధ్వజస్తంభం, ద్వారపాలకులు, ఆంజనేయస్వామి మరియు మూలమూర్తుల ప్రతిష్టాపన వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా జరిగింది.
ఈ సందర్భంగా పూర్ణాహుతి, గోదర్శనం, ప్రథమార్చన, శాంతి కళ్యాణం వంటి యజ్ఞ యాగాది కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం, గ్రామాల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞక్రతువుల్లో పాల్గొన్నారు. అనంతరం వేద ఆశీర్వచనం, నీరాజన మంత్రపుష్పాలు, దీక్షా విసర్జన కార్యక్రమాలతో మహోత్సవం ముగిసింది.
మహోత్సవం అనంతరం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన నిర్వహించగా వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. యాగ బ్రహ్మగా వ్యవహరించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులను గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన పురాతన ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. ధర్మ పరిరక్షణ, ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో కూడా నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారపాటి రామసీత, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బోప్పన సుధ, రిటైర్డ్ ఎస్పీ నక్క సూర్యచంద్రరావు, ఆలయ ఈవో ముదలవలస రాధ, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


