ఏలూరు, పశ్చిమ వాహిని, మే 9: యువత మరియు స్వయం సహాయక సంఘాల మహిళలు స్టార్టప్‌ల ద్వారా ఆర్థికంగా ఎదగడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పేర్కొన్నారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన వ్యాపారాలు సమర్థవంతమైన ప్రణాళిక, నాణ్యత, మార్కెటింగ్‌తో ముందుకు సాగితే పెద్ద పరిశ్రమల స్థాయికి ఎదగగలవని అన్నారు.
శనివారం కలెక్టర్ కార్యాలయంలోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో జిల్లా అర్బన్ సమాఖ్య, ఫౌండర్స్ రూఫ్ మరియు వివిధ స్టార్టప్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మహిళల భద్రత, స్మార్ట్ వెహికల్ మేనేజ్‌మెంట్, ప్రోటీన్ ఇన్ఫ్యూజ్డ్ కాఫీ, డీహైడ్రేషన్ టెక్నాలజీ, ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు వంటి విభిన్న రంగాల్లో స్టార్టప్‌లు ప్రారంభించిన యువతతో కలెక్టర్ చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని వినూత్న ఆలోచనలతో వ్యాపార రంగంలో ముందుకు సాగాలని యువతకు సూచించారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికల ద్వారా స్థానిక ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మార్కెట్ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లవచ్చని చెప్పారు.
ప్రభుత్వం అందిస్తున్న శిక్షణలు, రుణ సదుపాయాలు, ప్రోత్సాహక పథకాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ సూచించారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఇతరులకు ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అర్బన్ సమాఖ్య అధ్యక్షురాలు కె. మీనాక్షి, ఎస్‌హెచ్‌జీ పారిశ్రామికవేత్తలు వాణి, మాధురి, కృష్ణవేణి, ఫౌండర్స్ రూఫ్ ప్రతినిధులు విష్ణు, జగదీష్, స్టార్టప్ స్థాపకులు ఉజ్వల్ బొర్రా, విఠల్, సతీష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


