ఏలూరు, పశ్చిమ వాహిని, మే 8: స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న చైల్డ్ కేర్ హోమ్స్, వసతి గృహాల్లో ఆశ్రయం పొందుతున్న బాలబాలికల సంక్షేమంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్‌స్పెక్షన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో లైసెన్స్ పొందిన 23 చిల్డ్రన్ హోమ్స్‌ను అధికారులు ప్రతి నెలా సందర్శించి అక్కడి పిల్లల ఆరోగ్య పరిస్థితులు, యోగక్షేమాలు పర్యవేక్షించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ లేకుండా విద్యాసంస్థలతో అనుసంధానమై నడుస్తున్న చైల్డ్ హోమ్స్‌ను గుర్తించి వాటిని తప్పనిసరిగా నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు.
చైల్డ్ కేర్ హోమ్స్, హాస్టళ్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించబడేలా పర్యవేక్షణ ఉండాలని జేసీ స్పష్టం చేశారు. విద్యాశాఖ అనుమతులు పొందడంతో పాటు నిర్దిష్ట ప్రమాణాలు పాటిస్తూ పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని సూచించారు.
ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని, పిల్లలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని జేసీ తెలిపారు. ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు పిల్లల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సైకియాట్రిస్ట్ విభాగం కౌన్సిలర్ల సహకారంతో ప్రశ్నావళి రూపొందించి పిల్లల మానసిక పరిపక్వతను అంచనా వేయాలని పేర్కొన్నారు.
ఏదైనా మానసిక ఆందోళన లేదా రుగ్మత లక్షణాలు గమనించినట్లయితే వెంటనే కౌన్సిలింగ్, వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ డీసీపీవో సిహెచ్. సూర్యచక్రవేణి, డీఈవో వెంకటలక్ష్మమ్మ, ఐసీడీఎస్ పీడీ పి. శారద, జీసీడీఓ నవీన, డాక్టర్ వి. సాహిత్య, డాక్టర్ ప్రసాద్ రెడ్డి, కమిటీ సభ్యులు ఐకే రాజు, రవితేజ చిల్డ్రన్ హోమ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


