తాజా వార్తలు

10/recent/ticker-posts

మైనర్ బాలికపై అత్యాచారం కేసు.. నిందితుడు అరెస్ట్


ఏలూరు, పశ్చిమ వాహిని, మే 9: ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కళ్లచెరువు గ్రామంలో 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేశాడన్న ఆరోపణలపై ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సమాచారం.


పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు స్థానికంగా పాస్టర్‌గా పనిచేస్తున్న పశుపతిగా గుర్తించారు. మైనర్ బాలికను మోసం చేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన బయటపడటంతో గ్రామంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, నిందితుడిపై గతంలో కూడా పలు ప్రాంతాల్లో మహిళలు, యువతులపై లైంగిక వేధింపులు మరియు అత్యాచార ఆరోపణలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఆ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు, కేసులపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు పాత ఆరోపణలపై కూడా సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది.

ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. మైనర్ బాలికల రక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.