ఏలూరు, పశ్చిమ వాహిని, మే 10: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం “డబుల్ ఇంజిన్ సర్కార్” పేరుతో ప్రచారం చేసుకుంటూ ప్రజలపై భారాలు మోపుతోందని వి. శ్రీనివాసరావు విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూన్, జూలై నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా “ప్రజా పోరు బాట” కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఆదివారం ఏలూరులోని ఉద్దరాజు రామం భవనం లో నిర్వహించిన సిపిఎం జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు మొడియం నాగమణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు ప్రజా సమస్యలపై తీర్మానాలు ఆమోదించారు.
ఈ సందర్భంగా వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల పేరుతో కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి నాలుగు లేబర్ కోడ్ల రూపంలో కార్మికుల హక్కులను దెబ్బతీస్తోందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరచి వ్యవసాయ కార్మికుల జీవనోపాధిపై ప్రభావం చూపుతోందని ఆరోపించారు. “ఎస్‌ఐఆర్” వంటి విధానాల ద్వారా ప్రజల ఓటు హక్కు, పౌరసత్వ హక్కులపై దాడి జరుగుతోందని అన్నారు.
కేజీ బేసిన్ గ్యాస్‌పై రాష్ట్రానికి ఉన్న హక్కులను వదిలి పెద్ద కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అమెరికా యుద్ధోన్మాద విధానాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడి ప్రజలపై ధరల భారం పెరిగిందన్నారు. రైతులు, కార్మికులు, మహిళలు, దళితులు, యువజనుల హక్కుల పరిరక్షణ కోసం సిపిఎం పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు.
మతోన్మాద శక్తులపై కూడా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. కడపలో టిప్పు సుల్తాన్ పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ, ఆయనను స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తు చేశారు. ప్రజలు మతోన్మాద శక్తుల కుట్రలను ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు, బి. బలరాం మాట్లాడుతూ రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులు, మొక్కజొన్న రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని పేర్కొంటూ ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు ఆర్. లింగరాజు, ఎ. రవి, డి.ఎన్.వి.డి. ప్రసాద్, జి. రాజు, తెల్లం రామకృష్ణ, కె. శ్రీనివాస్, పి. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


