ఏలూరు, పశ్చిమ వాహిని, మే 10: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తడికలపూడి పోలీసులు గంజాయి రవాణాపై చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ మరియు ఎస్‌డీపీఓ సుస్మిత రంగనాధన్ పర్యవేక్షణలో ఈ చర్యలు చేపట్టారు.
జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.వి. సుభాష్ అందించిన సమాచారం మేరకు తడికలపూడి ఎస్సై కుమారి ఎస్. వల్లీ పద్మ తన సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం కామవరపుకోట గ్రామ పరిధిలోని తాడిచర్ల రోడ్డులో నరప్పకుంట చెరువు సమీపంలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద రెండు ప్లాస్టిక్ కవర్లలో 2.500 కిలోల గంజాయి లభ్యమైంది.
పోలీసులు నిందితులను పామర్తి రాజు (35), పోతవరం గ్రామం, నల్లజర్ల మండలం మరియు వాణరాశి మురళి (25), కామవరపుకోట గ్రామంగా గుర్తించారు. వారి వద్ద నుంచి 2 సెల్‌ఫోన్లు, రూ.900 నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.50 వేలుగా పోలీసులు అంచనా వేశారు.
ఈ ఘటనపై తడికలపూడి పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 83/2026గా ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ ఆపరేషన్‌లో ఎస్సై ఎస్. వల్లీ పద్మతో పాటు హెడ్ కానిస్టేబుల్ పి. రాంకుమార్, కానిస్టేబుళ్లు జి. అజయ్, డి. చంద్రమౌళి, చి. సుధీర్ పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఐదుగురు సిబ్బందికి రివార్డు ఇవ్వాలని జిల్లా ఎస్పీకి సిఫార్సు చేసినట్లు అధికారులు తెలిపారు.


