ఏలూరు, పశ్చిమ వాహిని, మే 10: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం చిన్నారుల సందడితో ఉల్లాసంగా కొనసాగుతోంది. ఆదివారం నిర్వహించిన సమ్మర్ క్యాంప్ కార్యక్రమాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని పలు సృజనాత్మక కార్యక్రమాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఉదయం 8 గంటలకు నిర్వహించిన “చదవడం మాకిష్టం” కార్యక్రమంలో సామాజిక కార్యకర్త, వాలంటీర్ చలసాని వెంకట సురేంద్ర (పెప్సి) పాల్గొని చిన్నారులతో నీతికథలు చదివించారు. అనంతరం ప్రముఖ గ్రంథాలయవేత్త, రచయిత వెలగా వెంకటప్పయ్య జీవిత విశేషాలు, ఆయన రచించిన తెలుగు వెలుగులు, గ్రంథాలయ జ్యోతి, గ్రంథాలయ వర్గీకరణ వంటి పుస్తకాల గురించి చిన్నారులకు వివరించారు.
అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని తల్లిదండ్రుల గొప్పతనం, తల్లి ప్రేమ విలువలపై చిన్నారులతో ప్రత్యేకంగా మాట్లాడించారు. డ్రాయింగ్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించారు. ప్రముఖ డాన్స్ మాస్టర్ వై. కృష్ణఫణికాంత్ వెస్ట్రన్ డాన్స్‌లో మెళకువలు నేర్పగా, వాలంటీర్ సిహెచ్ పద్మావతి పద్యకావ్యాలపై శిక్షణ అందించి పోటీలు నిర్వహించారు. విజేతలకు పుస్తకాలను బహుమతులుగా అందజేశారు.
డాక్టర్ సామా చంద్రదీపిక, శ్రీకాంత్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే ప్రతి ఆదివారం నిర్వహించే పోటీల్లో భాగంగా “గ్రంథాలయంలోని వివిధ విభాగాలు” అనే అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ప్రముఖ డ్రాయింగ్ టీచర్, కార్టూనిస్ట్ ఎంజె. సుజయ్ కృష్ణ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి.
ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ లైబ్రేరియన్ ఎ. నారాయణరావు పర్యవేక్షించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది బి. రమేష్ బాబు, ఎండి అస్లాం పాషా, బీవీఎస్ లక్ష్మి, చిన్నారుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


