ఏలూరు, పశ్చిమ వాహిని, మే 6: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం బుధవారం ఉత్సాహభరితంగా కొనసాగింది. చిన్నారుల్లో పఠనాభిరుచి, సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన వాలంటీర్లు పాల్గొని చిన్నారులకు వినోదాత్మకంగా శిక్షణ అందించారు.
ఉదయం 8 గంటలకు చిన్నారులతో పుస్తక పఠనం నిర్వహించి, నీతి కథలను చదివించి వాటిలోని సందేశాలను వివరించారు. అనంతరం ఉదయం 9 గంటలకు వాలంటీర్‌గా పాల్గొన్న జి. అశోక్ కుమార్ చిన్నారులకు స్పోకెన్ ఇంగ్లీష్‌పై శిక్షణ అందించారు. ఆంగ్ల భాషలో గ్రామర్‌కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తూ, సులభ పద్ధతుల్లో మాట్లాడే నైపుణ్యాలను వివరించారు.
ఉదయం 10 గంటలకు సీహెచ్. పద్మావతి వాలంటీర్‌గా పాల్గొని పురాతన తెలుగు కథలు, పద్యకావ్యాలు పరిచయం చేస్తూ తెలుగు భాష గొప్పదనాన్ని చిన్నారులకు వివరించారు. తెలుగు సాహిత్యం, సంస్కృతి పట్ల ఆసక్తి పెంపొందించేలా ఆమె శిక్షణ సాగింది. అనంతరం చిన్నారులకు కొంత విరామం కల్పించి, ప్రముఖ ప్రభుత్వ పాఠశాల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత తిరుపతి రమేష్ బాబు తరఫున విద్యార్థులకు స్నాక్స్ ఏర్పాటు చేశారు.
తరువాత ఏలూరుకు చెందిన ప్రముఖ వెస్ట్రన్ డాన్స్ మాస్టర్ మరియు నృత్య కళాకారుడు వై. కృష్ణఫణి కాంత్ వాలంటీర్‌గా పాల్గొని చిన్నారులకు నృత్యంలో శిక్షణ అందించారు. డాన్స్‌లోని ప్రాథమిక కదలికలు, స్టెప్స్ నేర్పుతూ చిన్నారులను ఉత్సాహపరిచారు. విద్య, వినోదం, సాంస్కృతిక కార్యక్రమాల సమ్మేళనంగా ఈ శిబిరం కొనసాగుతుండటంతో చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ శిక్షణ తరగతులు డిప్యూటీ లైబ్రేరియన్ ఎ. నారాయణరావు పర్యవేక్షణలో నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


