తాజా వార్తలు

10/recent/ticker-posts

గ్యాస్ సిలిండర్ల పంపిణీలో నిర్లక్ష్యం సహించం: జాయింట్ కలెక్టర్


ఏలూరు, పశ్చిమ వాహిని, మే 6: ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సిలిండర్ల పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో బుధవారం నిర్వహించిన ఎల్పీజీ సంబంధిత సమీక్ష సమావేశంలో సంబంధిత అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో కలిసి ఆయన పలు అంశాలపై సమీక్షించారు.


ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఎక్కడైనా చిన్నపాటి ఫిర్యాదు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన e-KYC ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి వినియోగదారుడికి పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. సిలిండర్ డెలివరీలను తప్పనిసరిగా OTP విధానంలోనే నిర్వహించాలని, OTP లేకుండా డెలివరీలు చేయకుండా పర్యవేక్షణ పెంచాలని అధికారులను ఆదేశించారు.

డెలివరీ సిబ్బంది అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారా అనే అంశంపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, ఎటువంటి అక్రమ వసూళ్లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి, సేవలపై నమ్మకం పెంచేలా వ్యవహరించాలని సూచించారు.

రేషన్ కార్డులకు సంబంధించిన సమస్యలు కూడా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, వాటి పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహిస్తూ గ్యాస్ పంపిణీ వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, పూర్తి స్థాయి నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఇ. బాబు విలియమ్స్, అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ వై. ప్రతాప్ రెడ్డి, బిపిసిఎల్ సేల్స్ ఆఫీసర్ చాంద్ మండల్, హెచ్పిసిఎల్ సేల్స్ ఆఫీసర్ శ్రీనివాసు, ఐఓసిఎల్ సేల్స్ ఆఫీసర్ వినోద్, సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్లు, సివిల్ సప్లై ఏఎస్ఐలు, జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.